ఖమ్మం: ఇండ్లు లేని వారికి మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు గుడ్ న్యూస్ చెప్పారు. సంక్రాంతి నుంచి ఇండ్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇండ్లు అందజేస్తామని శుభవార్త అందించారు. ఖమ్మం మునిసిపల్ కార్పొరేషన్ పరిధి 57వ డివిజన్ రమణగుట్టలో ఆదివారం (డిసెంబర్ 22) సీసీ రోడ్డు, స్టార్మ్ వాటర్ డ్రైన్ నిర్మాణ పనులకు మంత్రి తుమ్మల, ఖమ్మం ఎంపీ రఘురామ్ రెడ్డి శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. ఖమ్మం నగర అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. నగరానికి నీటి సరఫరా కోసం రూ.220 కోట్లతో అమృత్ ద్వారా పనులు చేపట్టామన్నారు.
ALSO READ | దళితులకు అమిత్ షా క్షమాపణ చెప్పాలి: ఎంపీ గడ్డం వంశీకృష్ణ
మున్నేరు నదికి రెండు వైపులా రిటైనింగ్ వాల్స్ నిర్మాణానికి నిపుణుల కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. డంపింగ్ యార్డ్ రోడ్డు విస్తరణకు కోటి 15 లక్షలు, స్లాటర్ హౌస్ నిర్మాణానికి రూ.8 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. కాగా, అధికారంలోకి వస్తే నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇచ్చిన మాట ప్రకారం తొలి విడతలో రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లు ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ సిద్ధమైంది. సంక్రాంతి తర్వాత లబ్దిదారులకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వనున్నారు.