కృష్ణమ్మను చేరనున్న గోదావరి

కృష్ణమ్మను చేరనున్న గోదావరి
  • జీబీకొత్తూరు పంప్‌‌‌‌హౌస్‌‌‌‌ వద్ద గోదావరి నీటిని విడుదల చేసిన మంత్రి తుమ్మల
  •  నేటి సాయంత్రానికి ఏన్కూరు వద్ద సాగర్‌‌‌‌ కెనాల్‌‌‌‌లో కలవనున్న గోదావరి నీరు

మణుగూరు, వెలుగు : గోదావరి, కృష్ణా జలాల అనుసంధానం తుది దశకు చేరుకుంది. ఖమ్మం జిల్లా బీజీ కొత్తూరు పంప్‌‌‌‌హౌస్‌‌‌‌ నుంచి సోమవారం విడుదలైన గోదావరి నీళ్లు మంగళవారం సాయంత్రానికి ఏన్కూరు సమీపంలోని సాగర్‌‌‌‌ కెనాల్‌‌‌‌లోకి చేరనున్నాయి. బీజీ కొత్తూరు పంప్‌‌‌‌హౌస్‌‌‌‌ వద్ద నీటి విడుదలను సోమవారం మంత్రి తుమ్మ నాగేశ్వర్‌‌‌‌రావు ప్రారంభించారు. అనంతరం సీతారామ, సీతమ్మ సాగర్‌‌‌‌ ప్రాజెక్టులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీతారామ ప్రాజెక్ట్‌‌‌‌ను అతి త్వరలోనే పూర్తి చేసి సాగునీరు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీతమ్మసాగర్ ప్రాజెక్టుకు కేంద్రం పర్మిషన్‌‌‌‌ ఇవ్వాలని కోరారు. 

ఖమ్మం జిల్లాలోని బీడు భూములకు గోదావరి జలాలను అందించాలన్న తన చిరకాల కోరిక నెరవేరబోతోందని సంతోషం వ్యక్తం చేశారు. పినపాక నియోజకవర్గానికి నీరందించే పులుసుబొంత ప్రాజెక్ట్‌‌‌‌ నిర్మాణానికి సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి సానుకూలంగా ఉన్నారని, త్వరలోనే ఆ పనులను కూడా ప్రారంభిస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి నిధుల కేటాయింపు పట్ల బీజేపీ వివక్ష చూపుతోందని, చెల్లించే పన్నులకు.. కేటాయించే నిధులకు ఏమాత్రం పొంతన లేదన్నారు. రైల్వే, రోడ్డు రవాణా వ్యవస్థలు అభివృద్ధి చెందాలంటే నిధుల కేటాయింపుల్లో పారదర్శకత పాటించాలని సూచించారు. కృష్ణా జలాల పంపిణీలోనూ కేంద్రం వివక్ష చూపిస్తోందని మండిపడ్డారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, జారే ఆదినారాయణ, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్‌‌‌‌ రాయల నాగేశ్వరరావు, డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, ఓరుగంటి భిక్షమయ్య పాల్గొన్నారు.