అగ్రికల్చర్ ఆఫీసర్లకు సంక్రాంతి కంటే ముందే ప్రమోషన్లు

అగ్రికల్చర్ ఆఫీసర్లకు సంక్రాంతి కంటే  ముందే ప్రమోషన్లు

హైదరాబాద్, వెలుగు: అగ్రికల్చర్​ఆఫీసర్లకు సంక్రాంతి పండుగ కంటే ముందే ప్రమోషన్లు కల్పిస్తామని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఎవరో ఒకరు చేసిన చిన్న తప్పుకు ఇంతమంది ప్రమోషన్ల కోసం ఇన్నాళ్లు ఎదురు చూడటం బాధాకరమన్నారు. అగ్రికల్చర్ ఆఫీసర్ల సమస్యలన్నీ పరిష్కరిస్తామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. శుక్రవారం అగ్రి డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి మంత్రి తుమ్మల ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. 

రాష్ట్ర ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యత వ్యవసాయం అని, ఎన్ని ఇబ్బందులున్నా రైతును నిలబెట్టాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి.. తెలంగాణ ఖ్యాతి, కీర్తి ప్రతిష్టలు దేశానికి చాటాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి కోరిక అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలు వ్యవసాయ అధికారుల చేతుల్లోనే ఉన్నాయని, రైతు చుట్టూనే అన్ని శాఖలు తిరుగుతూ ఉన్నాయని తెలిపారు.

 రాష్ట్ర ప్రభుత్వం గత బడ్జెట్‌‌లో 35 శాతం బడ్జెట్ వ్యవసాయ రంగానికే కేటాయించిందని ఆయన గుర్తుచేశారు. రుణమాఫీలో కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందని, దీంతో రైతుల్లో కొంత నిరాశ ఉన్న మాట వాస్తవమేనని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలు పకడ్బందీగా చేయాలంటే అగ్రికల్చర్ ఉద్యోగులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ సెక్రటరీ రఘునందన్ రావు, ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు, ఎండీ కె.రాములు, తదితరులు పాల్గొన్నారు.