నిజామాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతు కష్టాలు తీర్చిన సర్కారుగా పేరు సాధించడమే లక్ష్యంగా పనిచేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అన్నారు. రెండెకరాలలోపు రైతులకు పెట్టుబడి సహాయం అందించామని, మిగతా వారికి ఈ నెలాఖరులో జమ చేయాలని ఆఫీసర్లకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ఎన్ని సమస్యలు ఎదురైనా కాంగ్రెస్ ప్రకటించిన రైతు డిక్లరేషన్ అమలు చేసి తీరుతామన్నారు. బుధవారం ఆర్మూరు సెగ్మెంట్లోని నందిపేట మండలం ఆంధ్రా నగర్ విలేజ్‌లో మాజీ సీఎం ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. ఎన్టీఆర్ ఆశీస్సులతో పాలిటిక్స్‌లో వచ్చిన తాను.. ఆయన ఆశయాలకు అనుగుణంగా నిజాయితీతో ముందుకెళ్తున్నానన్నారు.
ఆయన ప్రవేశపెట్టిన పథకాలు దేశవ్యాప్తంగా ఇప్పటికీ అమలవుతున్నాయని చెప్పారు. రైతులు సగర్వంగా బతకడమే లక్ష్యంగా రేవంత్ సర్కారు పనిచేస్తున్నదన్నారు. జడ్పీ చైర్మన్ విఠల్‌రావు, అదనపు కలెక్టర్ యాదిరెడ్డి, బోధన్, ఆర్మూరు ఎమ్మెల్యేలు సుదర్శన్‌రెడ్డి, పైడి రాకేశ్ రెడ్డి, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్రావు, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, కాంగ్రెస్ నేతలు ముత్యాల సునీల్‌రెడ్డి, పొద్దుటూరి వినయ్‌రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా, ఆంధ్రానగర్ రావడానికి ముందు ధర్మారంలో మాజీ మంత్రి మండవ ఇంటికి మంత్రి తుమ్మల వెళ్లారు.