తెలంగాణపై కేంద్రానిది సవతి తల్లి ప్రేమ.. చూస్తూ ఊరుకోం: మంత్రి తుమ్మల

తెలంగాణపై కేంద్రానిది సవతి తల్లి ప్రేమ.. చూస్తూ ఊరుకోం: మంత్రి తుమ్మల

ఖమ్మం: కేవలం బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలకు తప్ప కేంద్ర బడ్జెట్లో ఇతర స్టేట్లకు నిధులు కేటాయించలేదని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అసహనం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‎లో తెలంగాణ రాష్ట్రానికి నిధులు కేటాయించకుండా కేంద్రం అన్యాయం చేసిందని ఆరోపిస్తూ టీపీసీసీ సోమవారం (ఫిబ్రవరి 3) రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది.

ఇందులో భాగంగా నిరసనలో పాల్గొన్న మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. కేంద్ర బడ్జెట్లో బయ్యారం స్టీల్ ప్లాంట్, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు కేటాయింపులు లేవు.. రాష్ట్రంలో కొత్త విమానాశ్రయాలు, రైల్వే లైన్లు, ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయానికి నిరసనగా అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రం అందజేశామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలని.. అలా కాకుండా పక్షపాతం వహించడం మంచిది కాదని హితవు పలికారు.

కేంద్రానికి తెలంగాణ కట్టే పన్ను ఎంత..? తిరిగి మీరు రాష్ట్రానికి ఇచ్చే నిధులెన్ని..? అని ప్రశ్నించారు. మా పన్నులు వేరే రాష్ట్రాలకు ఇస్తూ చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల పట్ల పక్షపాతం చూపడం ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదమన్నారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని విమర్శించారు. మా రాష్ట్ర హక్కు‎గా తెలంగాణకు బడ్జెట్ కేటాయించాలని ప్రధాని మోడీని డిమాండ్ చేస్తున్నామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు.