రైతు రుణమాఫీ కంప్లీట్: అసెంబ్లీలో మంత్రి తుమ్మల కీలక ప్రకటన

రైతు రుణమాఫీ కంప్లీట్: అసెంబ్లీలో మంత్రి తుమ్మల కీలక ప్రకటన

హైదరాబాద్: రైతు రుణమాఫీపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ పూర్తి అయ్యిందని ప్రకటించారు. రూ.2 లక్షల లోపు రుణాలు ఉన్న అర్హులకు మాఫీ చేశామని స్పష్టం చేశారు. రూ.2 లక్షలకు పైగా ఉన్న రుణాలు మాఫీ చేస్తామని తామెక్కడ చెప్పలేదని కీలక వ్యాఖ్యలు చేశారు. రుణమాఫీ విషయంలో ప్రతిపక్షానికి కన్ఫ్యూజన్ ఉందని.. కానీ ప్రభుత్వానికి క్లారిటీ ఉందని చెప్పారు. 

మీరు అనుకుంటున్నది ఒకటి.. మేం చేసేది ఇంకొకటన్నారు. కుటుంబానికి రెండు లక్షలు మాఫీ చేస్తామని చెప్పాం.. చేశాం.. మీరు కన్ఫ్యూజ్ కావద్దు.. ప్రజలను కన్ఫ్యూజ్ చేయొద్దని ప్రతిపక్షాలకు సూచించారు. ఇచ్చిన మాట ప్రకారం రుణం మాఫీ చేశామని పేర్కొన్నారు. రైతులకు పెట్టుబడి సాయం అందించే రైతు భరోసా స్కీమ్ పైన మంత్రి ప్రకటన చేశారు. ఈ నెలాఖరు వరకు (మార్చి) 5 ఎకరాల్లోపు రైతులకు నిధులు జమ చేస్తామని తెలిపారు. 

ALSO READ | నిరుద్యోగులకు గుడ్ న్యూస్: రెవెన్యూ శాఖలో కొత్తగా 10,954 పోస్టులు

మరోవైపు.. రుణమాఫీపై మంత్రి తుమ్మల చేసిన ప్రకటనపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ నుంచి వాకౌట్ చేసింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ.. అందరికీ రూ.2 లక్షల వరకు రుణమాఫీ అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. రూ.2 లక్షల పైన రుణం ఉన్నవారు మిగిలిన డబ్బులు కడితే రుణమాఫీ చేస్తామన్నారు. కానీ రూ.2 లక్షల లోపు వారికే రుణమాఫీ అని ఇప్పుడు మంత్రి అంటున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఇంకా చాలా మందికి రుణమాఫీ కాలేదని.. మంత్రి తుమ్మల మాత్రం సభలో రుణమాఫీ పూర్తి అయిందని అంటున్నారని మండిపడ్డారు. రుణమాఫీ విషయంలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా సభ నుంచి వాకౌట్ చేశామని తెలిపారు.