- నిపుణుల కమిటీ సూచనల ప్రకారం రిటైనింగ్ వాల్ డిజైన్
- పేదలకు పునరావాసం కల్పించిన తర్వాత ఆక్రమణల తొలగింపు
ఖమ్మం టౌన్, వెలుగు : రాష్ట్రంలోని ఇతర నగరాలకు, పట్టణాలకు ఖమ్మం నగరం ఆదర్శంగా ఉండేలా తీర్చిదిద్దాలని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అధికారులకు సూచించారు. మంగళవారం ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 46వ డివిజన్ సారథి నగర్ లో ఆయన పర్యటించారు. టీయూఎఫ్ఐడీసీ నిధులు రూ.కోటితో చేపట్టిన స్ట్రామ్ వాటర్ డ్రైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వరదల్లో అధిక ప్రాణ నష్టం జరగకుండా సేవలందించిన అధికారులు, ప్రజాప్రతినిధులకు అభినందనలు తెలిపారు. మున్నేరు వరద, చెరువుల నుంచి వచ్చే వరద పట్టణాన్ని ముంచే పరిస్థితి మరోసారి రాకుండా రిటైనింగ్ వాల్ నిర్మాణానికి చర్యలు చేపడుతామని తెలిపారు. నాలాల్లో నిర్మాణం చేపట్టిన పేదలకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు మరోచోట అందించి, వారిని తరలించిన తర్వాతే ఆక్రమణలను తొలగిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర రావు, నగర మేయర్ పునుకొల్లు నీరజ, నగరపాలక సంస్థ కమిషనర్ అభిషేక్ అగస్త్య, 46వ కార్పొరేటర్లు కన్నం వైష్ణవి, కమర్తపు మురళీ ఉన్నారు.
విద్యతోనే అభివృద్ధి సాధ్యం
విద్యతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని మంత్రి అన్నారు. కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ తో కలిసి ఖమ్మం ఉర్దూ షాదీఖానాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఖమ్మం నియోజకవర్గంలో ఉన్న 63 మసీద్ లకు రిపేర్ కోసం ఒక్కోదానికి రూ.లక్ష చొప్పున మంజూరు చేసి చెక్కులను అందజేశారు. వరదలు, పార్లమెంట్ ఎన్నికల కారణంగా మసీదుల నిర్వహణ నిధులు డిలే అయ్యాయని మంత్రి తెలిపారు.
షాదీఖానా నిర్వహణ కోసం మరో రూ.50 లక్షలు మంజూరు చేస్తామని చెప్పారు. ఖమ్మం నగరం అన్ని వైపులా ఖబరస్థాన్ ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రెసిడెన్షియల్ పాఠశాలలో పిల్లలను చేర్పించి వారు చదువుకునే ఏర్పాట్లు చేయాలని, విద్యతోనే తమ కుటుంబాలు బాగుపడతాయని చెప్పారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం అందించే నిధులతో కరెంట్, లైట, ఫ్యాన్ లాంటి సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. ఈద్ గా కోసం ఒక స్థలం చూశామని, వచ్చే ఈద్ వరకు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఆయిల్ పామ్ సాగు చేయాలి
రైతులు ఆయిల్ పామ్ పంట సాగు చేయాలని మంత్రి తుమ్మల సూచించారు. రఘునాథపాలెం మండలంలోని పలు గ్రామాల్లో ఆయన పర్యటించారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ప్రజల కోరిక మేరకు హెల్త్ సెంటర్ మంజూరు చేశామని, మంచి స్థలం ఎంపిక చేసుకుని నిర్మాణ పనులు ప్రారంభించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఇండ్లు లేని పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు అందజేస్తామని హామీ ఇచ్చారు. రాబోయే నెలలో మిగిలిన రైతులకు కూడా రుణ మాఫీ పూర్తి చేస్తామని చెప్పారు.
మండలంలో ఆయిల్ పామ్ మొక్కలు సాగు చేసేవారికి ప్రభుత్వ సబ్సిడీ అందజేస్తోందన్నారు. అంతర్ పంటల కింద కూరగాయలు, ఇతర పంటల సాగుతో అధిక లాభాలు పొందొచ్చని చెప్పారు. సంవత్సర కాలంలో రాంక్యా తండాకు సాగర్ నీరు అందించే బాధ్యత తీసుకుంటానని స్పష్టం చేశారు. మండలంలో రూ.25 కోట్లతో నూతన రోడ్లు డ్రైన్లకు మంజూరు చేశామని, డొంక రోడ్లకు రూ.50 కోట్లు తీసుకుని వస్తానని హామీ ఇచ్చారు. అనంతరం రాంక్యా తండాలో కల్లుగీత కార్మికులకు కాటమయ్య రక్షక కవచం భద్రత కిట్లను పంపిణీ చేశారు.
నీలి విప్లవంతో ఆదాయం పెంపు
నీలి విప్లవంతో మత్స్యకారుల ఆదాయం పెరుగుతుందని, ఆ దిశగా ప్రభుత్వం నీటి వనరులలో ఉచితంగా చేప పిల్లలు విడుదల చేస్తోందని మంత్రి తుమ్మల తెలిపారు. ఖమ్మం అర్బన్ మండలం బల్లేపల్లిలో ఆయన పర్యటించి రాయనిచెరువులో 26 వేల చేప పిల్లలను విడుదల చేశారు. ఖమ్మం జిల్లాకు సంబంధించి 212 మత్స్యకార సహకార సంఘాలు,16 వేల మంది సభ్యులు ఉన్నారని, వీరందరికీ ఉపయోగపడే విధంగా 300 పైగా చెరువుల్లో సుమారు 60 లక్షల చేప పిల్లలు ఉచితంగా సరఫరా చేస్తున్నామని మంత్రి తెలిపారు. గతంలో ఆంధ్ర, వెస్ట్ బెంగాల్ నుంచి చేపలు తెచ్చుకునే వారమని, ఇప్పుడు ఇక్కడి చేపల కోసం ఇతర ప్రాంతాల ప్రజలు వస్తున్నారన్నారు.