హైదరాబాద్, వెలుగు: మార్కెట్లో పత్తి పంటను అగ్గువకు అమ్ముకుని నష్టపోవద్దని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు సూచించారు. రాష్ట్రంలో రైతులు నష్టపోకుండా ప్రభుత్వం పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిందని తెలిపారు. మార్కెటింగ్ శాఖ తీసుకొచ్చిన వాట్సాప్ చాట్ యాప్ ద్వారా కొనుగోలు కేంద్రాలు దగ్గరలో ఎక్కడున్నాయో తెలుసుకొని, సీసీఐ కొనుగోళ్ల వద్దే మద్దతు ధరకు పత్తిని అమ్ముకోవాలని సూచించారు. కాగా, శనివారం సీసీఐ అధికారులతో మంత్రి సమీక్ష అనంతరం పత్తి కొనుగోళ్లు ఊపందుకున్నాయి. ఆయన ఆదేశాలతో సీసీఐ అధికారులు 105 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. సోమవారం ఒక్క రోజే 1,474 మంది రైతుల నుంచి 3,400 టన్నుల పత్తి కొనుగోలు చేసినట్లు అధికారులు తెలిపారు. అంతకుముందు వరకు మొత్తం 1,472 మంది రైతుల నుంచి 2,724 టన్నుల పత్తి కొనుగోలు చేశారు.
పట్టు పరిశ్రమతో రైతులకు లాభం
పట్టు పరిశ్రమకు మన రాష్ట్రం అనుకూలమని, ఈ రంగాన్ని ప్రోత్సహించే ప్రణాళికలు రూపొందించాలని మంత్రి తుమ్ముల నాగేశ్వర్రావు అధికారులను ఆదేశించారు. సోమవారం పట్టు పరిశ్రమశాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. సమగ్ర సిల్క్ పథకం నిధులను సద్వినియోగం చేసుకొని అన్ని జిల్లాలలో పట్టు పరిశ్రమను విస్తరించాలని అధికారులను ఆదేశించారు. పట్టు పురుగుల పెంపకం తక్కువ పెట్టుబడి అధిక రాబడితో సాధారణ రైతులకు అనుకూలంగా ఉంటుందని తెలిపారు.
దీంతో ఏటా సగటున రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల ఆదాయం పొందవచ్చన్నారు. ప్రభుత్వాలు రాయితీలు ప్రకటిస్తున్నందున పంట మార్పిడిలో భాగంగా రైతులు మల్బరిసాగు, పట్టు పురుగుల పెంపకం చేపట్టాలన్నారు. అధికారులు నాణ్యమైన చాకీ పురుగులను రైతులకు సరఫరా చేయాలని ఆదేశించారు. రైతులు “నాన్- స్పిన్నింగ్” సమస్య తీర్చేలా సెంట్రల్ సిల్క్ బోర్డు సైంటిస్టులతో అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాల వారీగా రైతు సదస్సులు నిర్వహించాలన్నారు.