ప్రభుత్వానికి మంచి పేరు తేవాలి : తుమ్మల నాగేశ్వరరావు

  • అధికారులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సలహా
  • సంక్షేమం, అభివృద్ధిని జోడెద్దుల్లా ముందుకు తీసుకుపోతాం 
  • రూ.40 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ 

నల్గొండ, వెలుగు : ఈనెల 26 నుంచి ప్రభుత్వం చేపడుతున్న నాలుగు పథకాలను సమర్థవంతంగా అమలు చేసి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని జిల్లా ఇన్​చార్జి మంత్రి, రాష్ట్ర వ్యవసాయ, సహకార, టెక్స్​టైల్స్​శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు సూచించారు. ఆదివారం నల్గొండలోని కలెక్టరేట్​లో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, ఉమ్మడి నల్గొండ జిల్లా అధికారులతో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, నూతన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిని జోడెద్దుల్లాగా ముందుకు తీసుకుపోతామన్నారు. ఈ నాలుగు పథకాలను అధికారులు మనసుపెట్టి అమలు చేయాలని చెప్పారు. రైతు భరోసా ఎలిమినేషన్ ప్రక్రియలో అధికారులు వ్యవసాయయోగ్యం కాతీ భూములను గుర్తించాలన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటివరకు రూ.40 వేల కోట్లను రైతుల ఖాతాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం జమ చేసిందని తెలిపారు. జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులు, రోడ్లను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తామన్నారు.

 అధికారులు క్షేత్రస్థాయి పర్యటించి ఈనెల 16  నుంచి 20 వరకు గ్రామ సభలు నిర్వహించాలని చెప్పారు. భూమిలేని వారిని, భూసేకరణ చేసిన భూములు, గుట్టలు, లేఅవుట్లు, నాలా కన్వెన్షన్ చేసిన భూములను గుర్తించి వారి పేర్లను రైతు భరోసా నుంచి తొలగించాలని సూచించారు. ఆర్వోఎఫ్ఆర్ కింద పట్టాలున్న రైతులకు రైతు భరోసా ఇవ్వాలని కలెక్టర్లను ఆదేశించారు. రైతు భరోసా విషయంలో ఎక్కడైనా అధికారులు అలసత్వం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. 

పేదల సంక్షేమమే ధ్యేయం.. 

పేదల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వంలో ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చామన్నారు. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అధికారులు బాధ్యతగా పనిచేయాలని సూచించారు. గత ప్రభుత్వం పదేండ్లలో నల్గొండ నియోజకవర్గంలో 797 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇప్పటివరకు లబ్ధిదారులకు కేటాయించలేదన్నారు. ఏటా నియోజకవర్గానికి 3,500 ఇండ్లు మంజూరు చేసి పేదల సొంతింటి కల నెరవేరుస్తామని తెలిపారు.

మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద భూమి లేని కూలీలకు రెండు విడతల్లో రూ.12 వేలు ఇస్తామని తెలిపారు. సమావేశంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యేలు బాలూనాయక్, పద్మావతిరెడ్డి, వేముల వీరేశం, మందుల సామేల్, జైవీర్ రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి, యాదాద్రి భువనగిరి కలెక్టర్ హనుమంతరావు, సూర్యాపేట కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ్, ఉమ్మడి జిల్లా అడిషనల్ కలెక్టర్లు, ఆర్డీవోలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.  

అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలి.. 

అధికారంలోకి వచ్చిన 13 నెలల్లో పేదలు, రైతులకు మేలు చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం గొప్ప విషయమని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డ్స్ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందించాలని, సేద్యం చేసే భూములకు రైతు భరోసా ఇవ్వాలని చెప్పారు. సర్వే చేసే అధికారులు ఎలాంటి ఒత్తిడి, ప్రలోభాలకు లొంగొద్దని, ఎలాంటి పొరపాట్లు లేకుండా విధులు నిర్వహించాలని తెలిపారు. అధికారులు తప్పు చేస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని చెప్పారు.