ఇయ్యాల (మార్చ్ 30) కొత్త ఆయిల్ పామ్​ ఫ్యాక్టరీకి శంకుస్థాపన : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ఇయ్యాల (మార్చ్ 30) కొత్త ఆయిల్ పామ్​ ఫ్యాక్టరీకి శంకుస్థాపన : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
  • ఈ నెలలోనే 90 శాతం రైతు భరోసా పూర్తి 

ఖమ్మం, వెలుగు : ఉగాది రోజు ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కల్లూరుగూడెంలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మం కలెక్టరేట్ లో శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఖమ్మం ప్రజలకు రైతాంగ సోదరులకు తెలుగు నూతన నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 14 ఆయిల్ పామ్ ఫ్యాక్టరీలు 3 సంవత్సరాల్లో ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈనెల 31రాత్రిలోపు 90 శాతం రైతు భరోసా పూర్తి చేస్తామన్నారు. సన్న ధాన్యానికి బోనస్ డబ్బులు ప్రభుత్వం విడుదల చేసిందని, ఎక్కడైనా గ్యాప్ ఉండి రైతులకు రాకపోతే కలెక్టర్, జిల్లా వ్యవసాయ అధికారులు పర్యవేక్షించాలని సూచించారు.

 సీతారామ ఎత్తిపోతల పథకం కింద రూ.600 కోట్లు ఖర్చు చేసి నిర్మాణాలు పూర్తి చేసి 101 కిలోమీటర్ల కాల్వలో నీరు తీసుకొచ్చింది.  ఆరు నెలల్లోనే 1500 క్యూసెక్కుల పరిమాణంతో రాజీవ్ లింక్​ కెనాల్ 9 కిలోమీటర్ల మేరకు పూర్తి చేసి సాగర్ కాల్వకు లింక్ చేసి పంటలకు నీళ్లందించింది గుర్తు చేశారు. భద్రాద్రి టెంపుల్ చుట్టూ భూ సేకరణకు మొదటి దశ కింద సీఎం రూ.34 కోట్లు మంజూరు చేశారని తెలిపారు. సింగరేణి ఆధ్వర్యంలో గతంలో నడిచే మైన్స్ కాలేజీని ఇంజినీరింగ్ కాలేజీగా మార్చామని, ఇప్పుడు కొత్తగూడెంలో ఎర్త్ సైన్స్ యూనివర్శిటీ ఏర్పాటుకు సీఎం అనుమతి ఇవ్వడం సంతోషకరమన్నారు. 

పాండురంగాపురం నుంచి విష్ణుపురం రైల్వే లైన్ మంజూరైందని, దీంతో పాండురంగాపురం నుంచి సారపాక వరకు రైల్వే లైన్ వేస్తే భద్రాచలానికి రైల్వే కనెక్టివిటి వస్తుందని తెలిపారు.  అమరావతి-- భద్రాచలం జాతీయ రహదారి పనులు పూర్తి చేసుకున్నామని, హైదరాబాద్–ఇల్లెందు–భద్రాచలం జాతీయ రహదారి పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు.  ఆగస్టు 15 నాటికి ఖమ్మం నుంచి రాజమండ్రి జాతీయ రహదారి పనులు పూర్తి అవుతాయన్నారు. పాత నేలకొండపల్లి రోడ్డుకు కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. పేదలకు ఉపయోగపడేలా సన్న బియ్యం ఉగాది నుంచి ఇవ్వాలని నిర్ణయించామన్నారు. 

గ్రానైట్ పరిశ్రమ మీద ఆధారపడే యువకులకు లాభం చేకూర్చేలా నిబంధనలు, మార్గదర్శకాలు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మీడియా సమావేశంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, అడిషనల్​ కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి,  ఖమ్మం ఆర్డీఓ నరసింహరావు, నేషనల్ హైవే మేనేజర్ దివ్య, జిల్లా వ్యవసాయ శాఖాధికారి పుల్లయ్య, జిల్లా సహకార అధికారి గంగాధర్, అధికారులు పాల్గొన్నారు.

సంక్షేమ పథకాలు పేదలకు చేరాలి

ఖమ్మం కార్పొరేషన్ : ప్రభుత్వం చేపట్టే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ఫలాలు ముందుగా పేదలకు చేరాలని మంత్రి  తుమ్మల అన్నారు. ఖమ్మం కార్పొరేషన్, రఘునాథపాలెం మండలంలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఖమ్మం నగరంలో మంచినీటి సరఫరా పథకానికి మరో రూ.220 కోట్లను త్వరలోనే మంజూరు చేస్తామని తెలిపారు. అండర్ గ్రౌండ్ డ్రైయినేజీ ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపామన్నారు.

 దశలవారీగా ఇందిరమ్మ ఇండ్లను అర్హులందరికీ అందిస్తామని చెప్పారు. మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య మాట్లాడుతూ ఖమ్మంలోని ప్రధాన రోడ్ల ప్రక్కన ఫుట్ పాత్ అభివృద్ధి కోసం రూ.10 కోట్ల నిధులు మంజూరు చేశామని, వారం రోజుల్లో పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. అనంతరం గ్రానైట్ సబ్సిడీ రూ. 19 కోట్ల విడుదలకు సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులు మంత్రి చేత గ్రానైట్ వ్యాపారులకు అందించారు. 

కృష్ణమూర్తి కుటుంబానికి అండగా ఉంటాం..

తల్లాడ : జక్కంపూడి కృష్ణమూర్తి కుటుంబానికి అండగా ఉంటామని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. తల్లాడ మండలం బిల్లుపాడు గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు జక్కంపూడి కృష్ణమూర్తి విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో తనని డిక్టేటడ్ చేయగల వ్యక్తి జక్కంపూడి కృష్ణమూర్తిని గుర్తు చేశారు. దాదాపు 45 సంవత్సరాల రాజకీయంలో జక్కంపూడి కృష్ణమూర్తి ఉన్నారన్నారు.