
- రూ.20,616 కోట్లు ఏకకాలంలో చెల్లించాం: మంత్రి తుమ్మల
- బీఆర్ఎస్ ఐదేండ్లలో రూ.11 వేలు కోట్లు మాఫీ చేస్తే అందులో రూ.8వేల కోట్లు వడ్డీలకే పోయినయ్
- మార్చి 31 వరకు ఐదెకరాల దాకా రైతు భరోసా
హైదరాబాద్, వెలుగు: 25.35 లక్షల రైతు కుటుంబాలకు రూ.20,616 కోట్లతో రుణమాఫీ చేశామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. అసెంబ్లీలో వ్యవసాయరంగానికి బడ్జెట్ కేటాయింపుల పద్దులపై మంత్రి సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఐదేండ్లలో రూ.11వేలు కోట్ల రుణమాఫీ చేస్తే అందులో రూ.8,500 కోట్లు బ్యాంకు వడ్డీలకే జమ అయ్యాయని, అసలు పంటరుణాల మాఫీ రూ.3 వేల కోట్లే జరిగిందన్నారు. గతంలో రైతులు పడ్డ ఇబ్బందులను చూసి కాంగ్రెస్ ప్రభుత్వం ఏకకాలంలో రుణమాఫీ చేసిందని తెలిపారు.
ఇప్పటి వరకు రూ.32,708 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. దేశంలో వ్యవసాయ, సంక్షేమ రంగానికి ఇంత పెద్ద ఎత్తున ఖర్చు చేసిన ప్రభుత్వం తెలంగాణ అని చెప్పారు. మా ప్రభుత్వం వచ్చి రాగానే గతంలో ఆగిపోయిన రైతు బంధు రూ.7,825 కోట్లు ఇచ్చామన్నారు. యాసంగి పంటలకు మూడెకరాల వరకు రైతు భరోసా ఇచ్చామని, ఈ నెలాఖరు వరకు 5 ఎకరాల వరకున్న వారికి ఇస్తామన్నారు. రైతు బీమా కొనసాగిస్తున్నామనీ, రైతుభరోసా రూ.12 వేలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
రూ.2 లక్షల పైబడిన రుణాలు చెల్లించం
గత పదేండ్లుగా పక్కనపెట్టిన యాంత్రీకరణ, మైక్రో ఇరిగేషన్ డ్రిప్ స్ప్రింక్లర్లు పునరుద్ధరిస్తున్నామన్నారు. గత ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ఇవ్వకపోవడంతో కేంద్రం నుంచి రావాల్సిన రూ.3 వేల కోట్లు కోల్పోయాం. అందుకే ఈ సారి నిధులు కేటాయించి ఆ స్కీం పునరుద్ధరిస్తున్నామని తెలిపారు. పంట నష్టపోయిన ప్రతిరైతుకు పరిహారం అందేలా ఫసల్ బీమాను పునరుద్ధరిస్తున్నామన్నారు. 32 జిల్లాలకు ఆయిల్ పామ్ సాగు, ఫ్యాక్టరీలను విస్తరిస్తామన్నారు.
రైతులకు ఎకరానికి రూ.51 వేల సబ్సిడీ ఇస్తున్నామన్నారు. బర్డ్ ఫ్లూ సమస్యపై అప్రమత్తమై చర్యలు చేపట్టామని తెలిపారు. రూ.2 లక్షలకు పైగా రుణాలు తీసుకున్న వారు ఆపై మొత్తం కట్టారని వారికి రుణమాఫీ ఎప్పుడు చేస్తారో చెప్పాలని హరీశ్ రావు క్లారిఫికేషన్ అడిగారు. దీనికి మంత్రి స్పందిస్తూ రూ.2 లక్షలకు పైగా ఉన్న పంట రుణాలను చెల్లించబోమని చెప్పారు. దీంతో మంత్రి ప్రకటనను బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించి సభ నుంచి వెళ్లిపోయారు.