రఘురాంరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి : తుమ్మల నాగేశ్వరరావు

రఘురాంరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి : తుమ్మల నాగేశ్వరరావు

కల్లూరు, వెలుగు :  ఖమ్మం పార్లమెంట్​ కాంగ్రెస్​ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ఆదివారం రాత్రి కల్లూరు పట్టణ మెయిన్ సెంటర్ లో నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో ఎమ్మెల్యే రాగమయితో కలిసి ఆయన మాట్లాడారు. 

ఏండ్ల కొద్దీ రఘురాం రెడ్డి తండ్రి సురేందర్ రెడ్డి కాంగ్రెస్​ పార్లమెంటు సభ్యుడిగా కొనసాగారని, ఆయన వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చిన రఘురాంరెడ్డికి రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ ఇవ్వాలని కోరారు. జిల్లాలో ముగ్గురు మంత్రులం ఉన్నాం.. కానీ ఢిల్లీలో పనులన్నీ జరగాలంటే రామసహాయంను గెలిపించుకోవాలన్నారు. 40 ఏళ్లుగా తనను సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలు భుజాలపై మోశారని, వారందరికీ రుణపడి ఉంటానన్నారు. నియోజకవర్గాన్ని అన్ని విధాలా రాష్ట్రంలోనే అగ్రభాగాన నిలిపానన్నారు. 

కల్లూరు పెద్ద చెరువును ఆధారంగా చేసి సమగ్ర ఫ్లోరైడ్ రహిత రక్షిత మంచినీటి పథకాన్ని కోట్ల రూపాయలతో నిర్మించి మండలంలోని అనేక గ్రామాలకు తాగునీటి సౌకర్యం కల్పించానని గుర్తు చేశారు. రెండు, మూడు నెలల్లో రైతులకు రుణ మాఫీ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్​ నేతలు దయానంద్, ప్రసాద్​రెడ్డి, మండల కాంగ్రెస్ నాయకులు అంకిరెడ్డి సత్యనారాయణరెడ్డి, పసుమర్తి చందర్రావు, భాగం ప్రభాకర్ చౌదరి, బొల్లం రామారావు, ఏనుగు సత్యంబాబు తదితరులు పాల్గొన్నారు.