తుక్కుగూడ సభకు తరలిరావాలి : తుమ్మల నాగేశ్వరరావు

ఖమ్మం టౌన్, వెలుగు : ఈనెల 6న రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో నిర్వహించే రాహుల్ గాంధీ సభకు కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి రావాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ఖమ్మం నగరంలోని మంత్రి క్యాంపు కార్యాలయం పక్కనే ఉన్న ప్రాంగణంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ అధ్యక్షతన గురువారం నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. 

గత బీఆర్ఎస్ పాలనలో ఏ ప్రభుత్వ శాఖలో చూసినా అవినీతి పేరుకుపోయిందని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులను తట్టుకుంటూ, కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల ముందు పక్క రాష్ట్రం అక్రమంగా మన ప్రాజెక్టుల నుంచి నీళ్లు తీసుకెళ్లినా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించిందని విమర్శించారు. ఇప్పుడు ప్రాజెక్ట్ ల్లో నీరు అడుగంటిందని,  అయినా నీటి ఎద్దడి నివారణకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. 

గతంలో నీళ్లు ఇవ్వకుండా,ఇప్పుడు రైతుల దగ్గరకు వెళ్లి బీఆర్ఎస్ నేతలు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. పంట నష్టపోయిన రైతులకు కాంగ్రెస్​ ప్రభుత్వం నష్టపరిహారం చెల్లిస్తుందని చెప్పారు. జిల్లాలో తాగునీటి సమస్య ఉన్నది వాస్తవమని, ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. శుక్రవారం సాగర్ జలాలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. అంతకుముందు జరిగిన పలు ప్రైవేట్ కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. సమావేశంలో సిటీ అధ్యక్షుడు జావీద్, టీపీసీసీ నాయకుడు రాయల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, కార్పొరేటర్ లకావత్ సైదులు తదితరులు పాల్గొన్నారు.