
తల్లాడ, వెలుగు : రాష్ట్రంలోని రైతులు నష్టపోకముందే కృష్ణా జలాల పంపకాలు పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు కేంద్ర ప్రభుత్వానికి కోరారు. ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం హిమాంనగర్ దగ్గర సీతారామ ప్రాజెక్ట్ రాజీవ్ లింక్ కెనాల్, గ్యాస్‌లైన్ వద్ద కాల్వను మళ్లించే సొరంగం పనులను సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ రాజీవ్ లింక్ కెనాల్ పనులను వారం, పది రోజుల్లో పూర్తయ్యేలా చూడాలని ఆఫీసర్లను ఆదేశించారు.
పంటలను కాపాడేందుకు, నీటి ఎద్దడి ఏర్పడకుండా ఉండేందుకు ఈ లింక్ కెనాల్ పనులను త్వరగా పూర్తి చేయాలని కోరారు. డిమాండ్‌కు తగ్గట్లు నీళ్లు అందుబాటులో లేవన్నారు. నాగార్జునసాగర్‌లో కూడా నీళ్లు లేకపోవడంతో ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయని, కేంద్ర ప్రభుత్వం కల్పించుకొని తెలంగాణకు రావాల్సిన వాటాను నిర్ధేశించి, నీళ్లు విడుదల చేసేలా ఇతర రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట నాయకులు గుగులోత్ శోభన్‌నాయక్, కట్టా సత్యనారాయణ ఉన్నారు.