హైదరాబాద్, వెలుగు: చేనేత కార్మికుల చేయూత పథకానికి గత ప్రభుత్వం బకాయి పెట్టిన నిధులతో పాటు ఎలాంటి బకాయిలు లేకుండా ఏక మొత్తంగా రూ.90 కోట్లను విడుదల చేశామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. గురువారం ఆయన ఒక ప్రకటనలో నేతన్నల చేయూత నిధుల వివరాలను వెల్లడించారు. ఈ పథకం సెప్టెంబర్ 2021 నాడు మొదలై ఆగస్టు 2024న ముగియనుందని, ఈ నిధుల విడుదల ద్వారా 36,133 మంది చేనేత కార్మికులు లబ్ధిపొందుతారని తెలిపారు.
చేనేత కార్మికులు, అనుబంధ కార్మికులు తమ నెలసరి వేతనంలో 8% వాటా జమ చేసినట్లైతే ప్రభుత్వం తమ వాటాగా 16% పొదుపు ఖాతాలో జమ చేస్తుందన్నారు. ఈ మొత్తాలను వడ్డీతో సహా 3 ఏళ్ల గడువు కాలం పూర్తికాగానే లబ్ధిదారులకు చెల్లించడం జరుగుతుందని మంత్రి వివరించారు. ఇలా 3 ఏళ్ల గడువు పూర్తికాగానే వడ్డీతో సహా దాదాపు రూ. 60,000 నుంచి 1,29,000 వరకు లబ్ధిపొందనున్నారన్నారు. గత ప్రభుత్వం నేతన్నలను పట్టించుకోకుండా వారి నోట మట్టికొట్టిందని ఆరోపించారు.