గ్రామాల అభివృద్ధికి పెద్దపీట : తుమ్మల నాగేశ్వరరావు

గ్రామాల అభివృద్ధికి పెద్దపీట : తుమ్మల నాగేశ్వరరావు

దమ్మపేట, వెలుగు :  రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో మౌలిక  వసతుల కల్పనకు పెద్దపేట వేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. తన రాజకీయ జీవితంలో 47 ఏళ్లుగా దమ్మపేట అశ్వరావుపేట ప్రాంతాల అభివృద్ధి కోసం కృషి చేశానని తెలిపారు. శుక్రవారం దమ్మపేట మండలంలో అల్లిపల్లిలో రూ.20 లక్షలతో ఏర్పాటు చేసిన గ్రామపంచాయతీ భవనం, రూ. 29 లక్షల వ్యయంతో చేపడుతున్న సీసీ రోడ్డుతోపాటు కల్వర్టు నిర్మాణ పనులను, గ్రామస్తులు స్వయంగా నిర్మించుకున్న ప్రభుత్వ పాఠశాల భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దమ్మపేట, అశ్వరావుపేట రైతులు పామాయిల్ రంగంలో రాణిస్తూ రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు.

ఈ ప్రాంతాల అభివృద్ధి కోసం మరిన్ని నిధులను తీసుకువచ్చి మారుమూల గ్రామాలకు కూడా రోడ్డు సౌకర్యాన్ని కల్పించేందుకు కృషి చేస్తానన్నారు. గిరిజనుల భూముల్లో గిరిజనేతరులు సాగు చేయడానికి వీలులేదని చెప్పారు. అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా రైతులకు అవసరమైన  గ్రావెల్ రోడ్లు, మెటల్ రోడ్లు వేయడానికి సుమారు రూ.25.66కోట్ల నిధులు మంజూరు  చేసినట్లు తెలిపారు. ఈ పనులు మార్చి నెల లోపల పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో నాగలక్ష్మి, కొత్తగూడెం ఆర్డీవో మధు, పంచాయతీరాజ్ కాశయ్య, ఆలపాటి ప్రసాద్​ ఉన్నారు.

ఆర్ అండ్ బీ అధికారులపై ఆగ్రహం

అశ్వారావుపేట : ఆర్ అండ్ బీ అధికారులపై మంత్రి తుమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు. అశ్వారావుపేట మండలంలోని గంగారం తుమ్మల వ్యవసాయ క్షేత్రానికి వెళ్లే క్రమంలో అశ్వారావుపేట పట్నంలోని జరుగుతున్న సుందరీకరణ పనులను ఆయన పరిశీలించారు. డ్రైనేజీ పనులు చాలా వంకర్లు ఉంటున్నాయని, ఒక దగ్గర ఓ కొలత మరో దగ్గర మరొక కొలత పెట్టి ఇబ్బందులు పెడుతున్నారని కొందరు వ్యాపారులు తుమ్మలకు దృష్టికి తీసుకెళ్లగా ఎందుకు ఇలా చేస్తున్నారని అధికారులు నిలదీశారు. ఎవరి కోసమో వంకరగా తిప్పవద్దని, ఎవరిని నష్టపర్చొద్దన్నారు. పని మొదలు పెట్టిన చోట కొలత ఎంత ఉందో పని చివరి వరకు కూడా అదే కొలత ఉండాలని ఆదేశించారు.