మురుగు కూపం నుంచి తేరుకుంటున్న ఖమ్మం  : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

  • ప్రణాళికాబద్ధంగా నగరాన్ని అభివృద్ధి చేస్తాం
  • రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
  • సారథినగర్మా-మిళ్లగూడెం రైల్వే అండర్ బ్రిడ్జి ప్రారంభం

ఖమ్మం, వెలుగు : గత పదేండ్ల నుంచి మురుగుకూపంగా ఉన్న ఖమ్మం ఇప్పుడిప్పుడే తేరుకుంటోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ప్రణాళికాబద్ధంగా నగరాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు.  రూ.1.90 కోట్లతో నిర్మించిన సారథినగర్- రైల్వే అండర్ బ్రిడ్జిని శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ పేద ప్రజలకు ఉపయోగపడాలని, తాను ఎమ్మెల్యే గా ఉన్నప్పుడే, రైల్వే అధికారులను కలిసి రైల్వే అండర్ బ్రిడ్జి మంజూరు చేసుకున్నట్లు గుర్తు చేశారు. ఇన్నేండ్ల తర్వాత ప్రజల కష్టాలను గమనించి ఏడాదిలోనే అండర్​ బ్రిడ్జిని ప్రారంభించుకున్నామని తెలిపారు.

ఖమ్మం ఖిల్లాను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధికి రోప్ వే మంజూరు చేశామన్నారు. ప్రజలు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలంటే పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని మున్సిపల్​ అధికారులకు సూచించారు. పట్టణీకరణ బాగా జరుగుతుందని, గ్రామీణ ప్రజలు బతుకుదెరువు కోసం, వైద్యం, సౌకర్యాల కోసం పట్టణాలకు వస్తున్నారని తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్ బాధ్యతగా, భవిష్యత్ తరాలకు వీలుగా మాస్టర్ ప్లాన్ చేపట్టాలన్నారు. కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ మాట్లాడుతూ 50 శాతానికి ఎక్కువ జనాభా పట్టణాల్లో నివసిస్తుందని తెలిపారు.

జిల్లాలో సర్వే పూర్తి అయ్యిందని, జనాభా 27 లక్షలు ఉండగా, కార్పొరేషన్ జనాభా సుమారు ఏడు లక్షల వరకు ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మేయర్​ పునుకొల్లు నీరజ, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, పోలీస్​ కమిషనర్​ సునీల్ దత్, ఖమ్మం నగరపాలక సంస్థ కమిషనర్ అభిషేక్ అగస్త్య, జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, కార్పొరేటర్లు కన్నం వైష్ణవి, దుద్దుకూరి వెంకటేశ్వర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.