సత్తుపల్లి, వెలుగు : సత్తుపల్లిని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. బుధవారం కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు డాక్టర్ మట్టా దయానంద్ జన్మదిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షుడు వందనపు సత్యనారాయణ ఏర్పాటు చేసిన 150 అడుగుల కేకును తుమ్మలతో కలిసి ఎమ్మెల్యే దంపతులు కట్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాడటానికి ప్రాధాన్యత గల నియోజకవర్గం సత్తుపల్లి అని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ తోట సుజల రాణి, సొసైటీ ఉపాధ్యక్షుడు గాదె చెన్నకేశవ రావు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
ఆత్మ చైర్మన్ కు పరామర్శ
పెనుబల్లి, వెలుగు : పెనుబల్లి మండలం లంకపల్లి గ్రామానికి చెందిన మాజీ ఆత్మ చైర్మన్ నున్నా రామక్రిష్ణ ను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం పరామర్శించారు. రామక్రిష్ణ తల్లి నున్నా లక్ష్మీదేవి ఇటీవల అనారోగ్యంతో మరణించగా ఆయన కుటుంబాన్ని మంత్రి కలిసి ధైర్యం చెప్పారు.
పామాయిల్ రైతుల వినతి
ములకలపల్లి, వెలుగు : తెలంగాణ మార్క్ఫెడ్ సంస్థ నుంచి ఎఫ్ పీవోలకు కిరాయిలు లేకుండా ఎరుపులు సప్లై చేయాలని కోరుతూ మూకమామిడి ఎఫ్ పీవో తరపున ఆ సొసైటీ చైర్మన్ కరుటూరి కృష్ణ పామాయిల్ రైతులతో కలిసి బుధవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు వినతి ప్రతం అందజేశారు. దమ్మపేట మండలం గండుగులపల్లిలో మంత్రిని కలిశారు.