సీతారామ ప్రాజెక్టు పూర్తయితే 8 లక్షల ఎకరాలకు సాగునీరు

సీతారామ ప్రాజెక్టు పూర్తయితే 8 లక్షల ఎకరాలకు సాగునీరు
  • టన్నెల్ పనులను పరిశీలించిన మంత్రి తుమ్మల

సత్తుపల్లి, వెలుగు: సీతారామ ప్రాజెక్టు కాలువలు, టన్నెల్స్ పూర్తయితే ఉమ్మడి జిల్లాలో 7 నుంచి 8 లక్షల ఎకరాల ఆయకట్టుకు గోదావరి జలాలు అందుతాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. గురువారం, మండల పరిధిలోని యాతాలకుంట సమీపంలో నిర్మిస్తున్న సీతారామ కాలువ 10 నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. టన్నెల్ లోపలకు తుమ్మల స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ వెళ్లారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ..  ఉమ్మడి జిల్లా ప్రజలకు సీతారామ ప్రాజెక్టు వరప్రదాయిని అన్నారు. ‘జిల్లా అంతటా సాగునీరు అందేలా ప్రణాళిక రూపొందించాం’ అని తుమ్మల చెప్పారు. 

జగ్గయ్యపేట నుంచి కొత్తగూడెం వరకు మరో రహదారికి ప్రతిపాదనలు జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. ప్రభుత్వంపై ఉన్న నమ్మకంతోనే ఈ ప్రాజెక్టుకు ప్రజలు భూసేకరణ సహకరించారని అన్నారు. సీతారామ ప్రాజెక్టు సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ఆగస్టు 15 నాటికి ప్రాజెక్టు పనులు పూర్తిచేసి గోదావరి జలాలు అందజేస్తామని  తెలిపారు. లంక సాగర్ ప్రాజెక్టు ద్వారా కూడా చెరువుల ద్వారా గోదావరి జలాలు అందుతాయని చెప్పారు. 

తహసీల్దారులు కొందరు హాజరు కాకపోవడం విచారకరమని, ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు అలసత్వం వహిస్తే సహించేది లేదని మంత్రి తుమ్మల హెచ్చరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్లు ముజమ్మిల్ ఖాన్, జితేష్ వి పాటిల్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజేశ్వరి, ఆర్డీఓ రాజేందర్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాల దుర్గాప్రసాద్, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ విజయకుమార్ సహా పలువురు నాయకులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.