ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం వ్యవసాయ మార్కెట్ పునర్ నిర్మాణ డిజైన్‌ను వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. సీజన్ సమయంలో రైతాంగం అమ్మకానికి తెచ్చే మిర్చి బస్తాలు యార్డ్ లో సరిపడక రోడ్లపై దించి ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో మిర్చి యార్డును పెంచి కొత్తగా నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో శనివారం ఖమ్మం లోని వీడీవోఎస్ కాలనీలోని మంత్రి తుమ్మల క్యాంపు కార్యాలయంలో ప్రతిపాదిత ప్లాన్ ను ఆయన పరిశీలించి పలు సూచనలు చేశారు.
ప్రస్తుతం ఉన్న మిర్చి యార్డు 15 ఎకరాల్లో నిర్మించినట్లు తెలిపారు. కాలక్రమేణా మిర్చి, పత్తి పంట సాగు పెరుగుతూ రావడంతో ఇప్పుడు ఇబ్బందులు వస్తున్నాయని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో మార్కెట్ యార్డు స్థలం తక్కువగా ఉండటం, సరైన సదుపాయాలు లేకపోవడం సమస్యగా మారిందన్నారు. ఈ విషయాలన్ని దృష్టిలో ఉంచుకొని, రైతుల సౌకర్యార్థం అంతర్జాతీయ స్థాయిలో
మార్కెట్ యార్డును పునర్ నిర్మించేందుకు నిర్ణయించినట్లు చెప్పారు. మార్కెటింగ్ పునర్ నిర్మాణానికి రూ.148.5 కోట్ల అంచనా వ్యయం కావాలని ప్రతిపాదిత నివేదికను ప్రభుత్వ ఆమోదానికి పంపించినట్లు తెలిపారు. డిజైన్ ను ఖమ్మం వ్యవసాయ మార్కెట్ గ్రేడ్ 1 సెక్రటరీ ప్రవీణ్ కుమార్ రెడ్డి మంత్రికి వివరించారు.