
- మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
- మున్నేరు నదిపై నిర్మిస్తున్న తీగల వంతెన పరిశీలన
ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మంను ట్రాఫిక్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. శనివారం ఖమ్మం కాల్వ ఒడ్డులోని మున్నేరు నదిపై నిర్మిస్తున్న తీగల వంతెన నిర్మాణ పనులను కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ తో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఖమ్మం నగరానికి మణిహారంగా ఉండేలా మున్నేరుపై కేబుల్ బ్రిడ్జి నిర్మిస్తున్నామని తెలిపారు. రూ.180 కోట్లతో ప్రభుత్వం ఈ బ్రిడ్జి పనులు చేపడుతోందని చెప్పారు.
24 నెలల్లోనే పనులు పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ ప్రారంభంలో పనులు కొంత ఆలస్యమైనా ప్రస్తుతం వర్క్స్ స్పీడప్ అయ్యాయని తెలిపారు. బ్రిడ్జి నిర్మాణంలో ఎటువంటి ఆస్తి కోల్పోయినా వారి జీవనోపాధి కోల్పోకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కేబుల్ బ్రిడ్జికి సంబంధించిన అప్రోచ్ రోడ్డు ను 6 లైన్ రోడ్డుగా అభివృద్ధి చేయాలన్నారు. ఖమ్మం నగరంలో కూడా రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్నామని తెలిపారు. బైపాస్ రోడ్డు, కస్బా బజార్ లో రోడ్డు విస్తరణ చేయడం వల్లే అక్కడ అభివృద్ధి సాధ్యమైందని గుర్తు చేశారు. ఆగస్టు 15 నాటికి ఖమ్మం మీదుగా రాజమండ్రి గ్రీన్ ఫీల్డ్ హైవే పూర్తవుతుందని చెప్పారు.
పొన్నెకల్ నుంచి ఇల్లెందు క్రాస్ రోడ్డుకు జాతీయ రహదారికి అమరావతి రాజధాని రోడ్డు కనెక్ట్ చేస్తూ రూ.120 కోట్లు మంజూరు చేసామని తెలిపారు. ఖమ్మం నగరం ట్రాఫిక్ ఫ్రీ చేసే దిశగా రాజమండ్రి, అమరావతి జాతీయ రహదారుల నిర్మాణం, వాటిని కనెక్ట్ చేసేందుకు కూడా పనులు మంజూరు చేశామని వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఆర్ అండ్ బీ ఎస్ఈ హేమలత, ఈఈ యుగేందర్, ఖమ్మం ఆర్డీవో నరసింహా రావు, ఖమ్మం అర్బన్ తహసీల్దార్ రవి కుమార్, ఆర్ అండ్ బీ డీఈ చంద్ర శేఖర్, జేఈ విశ్వనాథ్, విద్యుత్ శాఖ ఏఈ క్రాంతి సిన్హా పాల్గొన్నారు.
ఇఫ్తార్ విందుకు హాజరు..
ఖమ్మం నగరంలోని కాల్వ ఒడ్డులో ఉన్న మదర్సాలో శనివారం సాయంత్రం ముస్లిం సోదరులు నిర్వహించిన ఇఫ్తార్ విందుకు మంత్రి తుమ్మల కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్, సీపీ సునీల్ దత్ హాజరయ్యారు. హలీం తిని కాసేపు వారితో ముచ్చటించారు.