ఉగాదిలోపు ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభిస్తాం : మంత్రి తుమ్మల

ఉగాదిలోపు ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభిస్తాం : మంత్రి తుమ్మల
  • మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను పరిశీలించిన మంత్రి తుమ్మల

ఖమ్మం టౌన్, వెలుగు: రఘునాథ పాలెం మండలంలోని మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ ను ఈ ఉగాది వరకు ప్రారంభించేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. శనివారం లిఫ్ట్ ఇరిగేషన్ పైప్ లైన్ పనుల తీరును పరిశీలించారు. 

ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలో నీటి సౌలభ్యం కోసం సీఎం రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని అడగ్గానే 36 చెరువులకు నీళ్లు అందించేందుకు రూ.66 కోట్లు మంజూరు చేశారని తెలిపారు. భూగర్భజలాలు రైతాంగానికి ఉపయోగపడేలా, ఆయిల్ పామ్, ఉద్యాన పంటల సాగుతో మండలం సస్యశ్యామలంగా మారనుందన్నారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పి.దుర్గాప్రసాద్, సిటీ మేయర్ నీరజ, నేత సాధు రమేశ్ రెడ్డి పాల్గొన్నారు. 

మిత్రుడి పాడె మోసిన మంత్రి 

సత్తుపల్లి, వెలుగు: మాజీ జడ్పీటీసీ సత్యసాయి చారిటబుల్ ట్రస్ట్ గౌరవ అధ్యక్షుడు గాదె సత్యం అనారోగ్యంతో శుక్రవారం హైదరాబాద్ లో చనిపోయారు. శనివారం స్థానిక కాకర్లపల్లి రోడ్డులోని ఆయన నివాసంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజి ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, మెచ్చ నాగేశ్వర రావు, రాష్ట్ర నేత డాక్టర్ మట్టా దయానంద్ సహా పలువురు నివాళులర్పించారు. సత్యం అంతిమ యాత్రలో తుమ్మల నాగేశ్వరరావు పాల్గొని మిత్రుడి పాడె మోసి కన్నీటి పర్యంతమయ్యారు.