అగ్నిప్రమాదాలు జరగకుండా చర్యలు : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

అగ్నిప్రమాదాలు జరగకుండా చర్యలు : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
  •  రూ.100 కోట్లతో ఖమ్మం మార్కెట్‌‌ ఆధునికీకరణ పనులు
  • ఖమ్మం మార్కెట్‌‌లో అగ్నిప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రి

ఖమ్మంటౌన్‌‌, వెలుగు : మార్కెట్‌‌లో అగ్ని ప్రమాదాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ఖమ్మం పత్తి మార్కెట్‌‌లో బుధవారం రాత్రి అగ్నిప్రమాదం జరిగిన స్థలాన్ని గురువారం కలెక్టర్‌‌ ముజమ్మీల్‌‌ ఖాన్‌‌, కమిషనర్‌‌ సునీల్‌‌దత్‌‌తో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్కెట్‌‌ యార్డులో జరిగిన ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదన్నారు. పత్తి బేళ్లు తగులబడుతున్నాయని తెలిసిన 10 నిమిషాల్లోనే ఫైర్‌‌ ఇంజిన్‌‌ రావడంతో ప్రమాద తీవ్రత తగ్గిందన్నారు. భవిష్యత్‌‌లో ప్రమాదాలు జరగకుండా చూసుకోవడంతో పాటు  ప్రస్తుత ప్రమాదం ఎలా జరిగిందో కారణాలు తెలుసుకోవాలని, మార్కెట్‌‌లోని భద్రతా ఏర్పాట్లపై ప్రభుత్వానికి రిపోర్ట్‌‌ అందించాలని ఆఫీసర్లను ఆదేశించారు.

మార్కెట్‌‌ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు రూ. 100 కోట్లతో చేపట్టే పనులకు త్వరలోనే శంకుస్థాపన చేస్తామన్నారు. వరంగల్, నిజామాబాద్, ఖమ్మం వంటి పెద్ద మార్కెట్లను అభివృద్ధి చేసేందుకు రిపోర్ట్‌‌లు సిద్ధం చేస్తున్నామన్నారు. రైతులకు, వ్యాపారులకు సౌకర్యంగా ఉండడంతో పాటు ఎవరూ నష్టపోకుండా కొత్త మార్కెట్‌‌ నిర్మిస్తామని చెప్పారు. మార్కెట్‌‌ నిర్మాణాన్ని కలెక్టర్‌‌ నిరంతరం పర్యవేక్షించాలని, వర్షాకాలంలోపు మార్కెట్‌‌కు ఓ స్వరూపం రావాలని సూచించారు. కార్యక్రమంలో మేయర్‌‌ పునుకొల్లు నీరజ, నగర పాలక సంస్థ కమిషనర్‌‌ అభిషేక్‌‌ అగస్త్య, అడిషనల్‌‌ కలెక్టర్‌‌ శ్రీజ, మార్కెటింగ్‌‌ ఆఫీసర్‌‌ అలీమ్, ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు పాల్గొన్నారు.

అర్వింద్ ఎంపీ కాబట్టి గౌరవంగా మాట్లాడుతున్నా..

అర్వింద్‌‌ నిజామాబాద్‌‌ ఎంపీ కాబట్టి తాను ఎంతో గౌరవంగా మాట్లాడుతున్నానని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ‘నిజామాబాద్‌‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వంలో పీఎంకు విజ్ఞప్తి చేశాను, ఇక్కడి రైతులకు ప్రధాని న్యాయం చేశారు కాబట్టి ధన్యవాదాలు తెలిపాను’ అని తుమ్మల చెప్పారు. అందులో తన తప్పు ఏమైనా ఉంటే ప్రజలు శిక్షించినా, అర్వింద్‌‌ శిక్షించినా పర్లేదన్నారు. 

ఖమ్మం మార్కెట్‌‌కు చేరిన ఫైర్‌‌ ఇంజిన్‌‌

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌‌ కోసం కేటాయించిన ఫైర్‌‌ ఇంజిన్‌‌ గురువారం మార్కెట్‌‌కు చేరుకుంది. ఖమ్మం మార్కెట్‌‌ యార్డుకు ఒక ఫైర్‌‌ ఇంజిన్‌‌ కేటాయించాలని ఉదయం మంత్రి ఆదేశాలు జారీ చేయగారాత్రి 8 గంటల వరకు ఫైర్‌‌ ఇంజిన్‌‌ మార్కెట్‌‌కు వచ్చింది.దీంతో పాలకమండలి చైర్మన్‌‌ హనుమంతరావు, వైస్‌‌చైర్మన్‌‌  తల్లాడ రమేశ్‌‌ మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.