
- మంత్రి తుమ్మల నాగేశ్వరావు
ములకలపల్లి, వెలుగు: ఉమ్మడి జిల్లా లో చివరి ఆయకట్టు పొలాలకు సాగునీరు అందించేందుకు సీతారామ ప్రాజెక్టు ను కంప్లీట్ చేయడమే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావుఅన్నారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలోని పూసుగూడెం, కమలాపురం గ్రామాల్లోని సీతారామ ప్రాజెక్టు ఎత్తిపోతల పనులు, నీటి విడుదలను పరిశీలించారు. మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లాలో లక్షా 30 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు.
కృష్ణా జలాల పంపిణీ లో కేంద్రం నిమ్మకు నీరెత్తినట్లు గా వ్యవహరిస్తోందని విమర్శించారు. తెలంగాణకు నీటి కేటాయింపుల పై కేంద్ర జలశక్తి మంత్రిని కలిసేందుకు సీఎం రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమకుమార్ రెడ్డి ఢిల్లీ వెళ్లారని చెప్పారు. రాజీవ్ కెనాల్ ద్వారా సాగర్ ఆయకట్టుకు సాగునీరు అందించనున్నట్లు తెలిపారు. సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్ లిఫ్ట్ లతో వైరా రిజర్వాయర్ కు గోదావరి జలాలు తరలించడంతో ఆయకట్టు స్థిరీకరణ అవుతుందన్నారు. తుమ్మల వెంట అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, ఇరిగేషన్ ఆఫీసర్లు ఉన్నారు.