పత్తి కొనుగోళ్లలో జాప్యం జరగొద్దు : తుమ్మల నాగేశ్వర్​రావు

పత్తి కొనుగోళ్లలో జాప్యం జరగొద్దు : తుమ్మల నాగేశ్వర్​రావు
  • మార్కెట్​కు వచ్చిన వెంటనే కొనాలె
  • మార్కెటింగ్​శాఖ అధికారులతో మంత్రి సమీక్ష

హైదరాబాద్, వెలుగు: పత్తి కొనుగోళ్ల విషయంలో ఎలాంటి జాప్యం లేకుండా మార్కెట్​కు వచ్చిన వెంటనే కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్​రావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం సెక్రటేరియెట్​లో మార్కెటింగ్​శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అకాల వర్షాల నేపథ్యంలో మార్కెట్​కు వచ్చిన పత్తి తడవకుండా మార్కెటింగ్​, సీసీఐ అధికారులు తగిన  ఏర్పాటు చేయాలన్నారు. పత్తి కొనుగోళ్ల విషయంలో ఎలాంటి అవకతవకలు జరుగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. 

ఫిర్యాదులు వచ్చిన వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వాట్సాప్​  సేవల 88972 81111ద్వారా వెయిటింగ్​ టైమ్, పేమెంట్ స్టేటస్, కంప్లయింట్లు ఇతర సేవలను రైతులు వినియోగించుకోవాలని కోరారు. మార్కెటింగ్​శాఖ జిల్లా అధికారులు, సెక్రటరీలో రైతులకు అందుబాటులో ఉండాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ప్రాథమిక సహకార సంఘాల(ప్యాక్స్​)ను రీఆర్గనైజ్ చేసి అవసరమైన చోట కొత్త శాఖలు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలను సిద్ధం చేయాలని కోఆపరేటివ్ అధికారులను ఆదేశించారు. 

డీసీసీబీ, డీసీఎంఎస్ లలో గతంలో జరిగిన అవకతవకలపై శాఖపరమైన విచారణను త్వరిత గతినపూర్తి చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, డబ్బులు రికవరీ చేయాలని ఆదేశించారు. సమీక్షలో మార్కెటింగ్​శాఖ డైరెక్టర్ ఉదయ్​కుమార్, కోఆపరేటివ్ అడిషనల్ రిజిస్ట్రార్ శ్రీనివాస్​రావు తదితరులు పాల్గొన్నారు.