
- ఇకపై డే టు డే పనిపై కలెక్టర్ దృష్టిసారించాలి
- మే లోపు కరకట్ట జాతీయ రహదారికి ఇరువైపులా కంప్లీట్ కావాలి
- సాధ్యం కాకపోతే కాంట్రాక్టు ఏజెన్సీని తప్పించాలి
- ఇరిగేషన్ఇంజినీర్లపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం
భద్రాచలం, వెలుగు : గోదావరి వరదల నుంచి భద్రాచలం పట్టణంలోని సుభాష్‌నగర్, శాంతినగర్ కాలనీలను రక్షించేందుకు నిర్మిస్తున్న కరకట్ట పనులు ఇంకెప్పుడు పూర్తి చేస్తారంటూ ఇరిగేషన్ ఇంజినీర్లపై రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత, జౌలిశాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం కలెక్టర్ జితేశ్ వి పాటిల్, ఎస్పీ రోహిత్‌రాజ్, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ పొదెం వీరయ్యతో కలిసి ఆయన కరకట్ట నిర్మాణపు పనులను పరిశీలించారు.
గతేడాది వరదల సమయంలో తాను వచ్చి చూసినప్పుడు ఎలా ఉందో.. ఇప్పుడు అలాగే ఉందంటూ అసహనం వ్యక్తం చేశారు. విజయవాడ-–జగదల్పూర్ జాతీయ రహదారిని కరకట్టను దాటిస్తున్నందున నేషనల్హైవేస్ అథారిటీ అనుమతి ఆలస్యం అవుతుందని ఇరిగేషన్ఇంజినీర్లు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. దానికి, కరకట్ట నిర్మాణానికి ఏం సంబంధం అంటూ మంత్రి నిలదీశారు. స్లూయిజ్‌లకు ఆటోమెటిక్ షట్టర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అక్కడి నుంచే సంబంధిత ఇంజినీర్లతో ఫోన్లో మాట్లాడిన మంత్రి నిర్మాణంలో జరుగుతున్న నిర్లక్ష్యం, అలసత్వంపై సీరియస్ అయ్యారు.
ఎలివేటర్రోడ్డు నిర్మాణం డిజైన్‌కు ఇంత ఆలస్యం ఎందుకు అని ప్రశ్నించారు. కేవలం శాఖల మధ్య సమన్వయ లోపమే ప్రధాన కారణమని అసహనం వ్యక్తం చేశారు. ఇకపై డే టు డే పనిపై కలెక్టర్ దృష్టిసారించాలన్నారు. మే 31 నాటికి కరకట్ట జాతీయ రహదారికి ఇరువైపులా పూర్తి కావాలని, సాధ్యం కాకపోతే కాంట్రాక్టు ఏజెన్సీని తప్పించాలని చెప్పారు.
ఎర్త్ సైన్స్ యూనివర్శిటీ ఏర్పాటుకు సీఎం సుముఖం
భద్రాద్రికొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఎర్త్ సైన్స్ యూనివర్శిటీ ఏర్పాటుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సుముఖం వ్యక్తం చేశారని మంత్రి తుమ్మల వెల్లడించారు. భద్రాచలంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్ని రకాల ఖనిజ నిక్షేపాలు ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వాటిని వెలికితీసేలా విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఈ యూనివర్శిటీ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.
భద్రాచలం సీతారామచంద్రస్వామి దర్శనానికి భక్తులకు రవాణా సౌకర్యం మెరుగుపరిచేందుకు పాండురంగాపురం-సాకేతపురి సారపాక వరకు రైల్వే లైన్ నిర్మించేందుకు సర్వే పూర్తి చేశామని తెలిపారు. కొత్తగూడెం ఎయిర్‌పోర్టు నిర్మాణం కూడా త్వరలో జరుగుతుందని తెలిపారు. నేషనల్ హైవే అమరావతి నుంచి జగదల్పూర్ వరకు, భద్రాచలం–-ఏటూరునాగారం డబుల్‌లైన్ రోడ్ల నిర్మాణాలు త్వరలో పూర్తి చేస్తామని చెప్పారు. సమ్మక్క, సారక్క బ్యారేజీ పూర్తయితే రాజమండ్రి వరకు జలరవాణా ఏర్పడుతుందన్నారు.
భద్రాచలం దేవస్థానం డెవలప్మెంట్ కోసం రూ.34కోట్లు మా ప్రభుత్వం రిలీజ్ చేసిందని, అవసరమైతే మరిన్న నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. సీతారామ, సీతమ్మసాగర్, తుమ్మలచెరువు, మారేడుబాక వరకు కాల్వల నిర్మాణాలు చేపట్టి 70వేల ఎకరాలకు నీరు అందిస్తామన్నారు. త్వరలో దుమ్ముగూడెం మండలంలోని ప్రగళ్లపల్లి ఎత్తిపోతలను పూర్తిచేస్తామని
తెలిపారు.
శ్రీరామనవమి ఏర్పాట్లపై రివ్యూ
సీతారామచంద్రస్వామి దేవస్థానంలో జరిగే బ్రహ్మోత్సవాలు, కల్యాణం, పట్టాభిషేకం తిలకించేందుకు దేశ, విదేశాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారని, వారికి కల్పించే సదుపాయాలు, సౌకర్యాలల్లో ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదని మంత్రి తుమ్మల అధికారులను ఆదేశించారు. మిథిలాస్టేడియంలో జరుగుతున్న పనులను శుక్రవారం ఆయన తనిఖీ చేశారు.
అనంతరం ఆర్డీవో ఆఫీసులో అధికారులతో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసి మాట్లాడారు. పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సీఎం రేవంత్‌రెడ్డి తీసుకొస్తున్నందున వీవీఐపీలు, వీఐపీల, రామభక్తులకు ఎలాంటి అసౌకర్యం కల్గకుండా ఏర్పాట్లు ఉండాలన్నారు. అన్ని శాఖల యాక్షన్ ప్లాన్‌ను రివ్యూ చేసి అన్నింటికీ మరో సారి చెక్ చేసుకోవాలని సూచించారు. లడ్డూ ప్రసాదాలు, కల్యాణ తలంబ్రాలు చాలా కీలకమని, అవి సరిపోను అందుబాటులో ఉంచాలని ఈవో రమాదేవిని ఆదేశించారు.