రైతుల సంక్షేమమే ఫస్ట్‌‌‌‌‌‌‌‌ ప్రయారిటీ : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

  • కొత్తగూడెం, పాల్వంచ ఏరియాలో విమానాశ్రయం
  • వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

సత్తుపల్లి, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికే ఫస్ట్‌‌‌‌‌‌‌‌ ప్రయారిటీ ఇస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. శుక్రవారం ఎమ్మెల్యే మట్టా రాగమయితో కలిసి సత్తుపల్లి మండలం బుగ్గపాడులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం, కాకర్లపల్లిలో కోఆపరేటివ్‌‌‌‌‌‌‌‌ సొసైటీ బిల్డింగ్‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రైతులు లాభసాటి పంటలను సాగు చేయాలని సూచించారు. కొత్తగూడెం, పాల్వంచ ఏరియాలో విమానాశ్రయం ఏర్పాటుకు కృషి చేస్తున్నామని, ఈ నెలలో కేంద్ర బృందం పర్యటన కూడా ఉంటుందన్నారు.

పొలాలకు సాగునీరు, స్టూడెంట్లకు క్వాలిటీ ఎడ్యుకేషన్‌‌‌‌‌‌‌‌ అందించేందుకు కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. నియోజకవర్గంలో కొత్త వ్యవసాయ సహకార సంఘాల ఏర్పాటుకు ప్రపోజల్స్‌‌‌‌‌‌‌‌ పంపాలని సూచించారు. సహకార సొసైటీలను బలోపేతం చేయడం ద్వారా ఎరువులు, గోడౌన్స్‌‌‌‌‌‌‌‌ నిర్మాణమే కాకుండా యంత్ర సామగ్రి కూడా అందించే కార్యక్రమం చేపడుతున్నామన్నారు. రైతు భరోసా కింద జనవరి 26 నుంచి రైతుల అకౌంట్లలో రూ. 10 వేల కోట్లు జమ చేయబోతున్నట్లు చెప్పారు. వచ్చే సీజన్‌‌‌‌‌‌‌‌ నుంచి పంట బీమా కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా మొదటి సంవత్సరంలోనే రైతుల సంక్షేమం కోసం రూ.40 వేల కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. రైతాంగ పథకాల కోసం మార్చి లోపు మరో రూ. 10 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు చెప్పారు. అనంతరం పలువురికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌‌‌‌‌‌‌‌ చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కల్లూరు ఆర్డీవో ఎల్‌‌‌‌‌‌‌‌.రాజేందర్, తహసీల్దార్‌‌‌‌‌‌‌‌ యోగేశ్వరరావు, నాయకులు దయానంద్‌‌‌‌‌‌‌‌, గోనె గోపాలరావు, శివ వేణు, చలసాని సాంబశివరావు, చల్లగుల్ల నరసింహారావు, ప్రసాద్ బాబు పాల్గొన్నారు.