
- ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ నిర్మించుతాం..
- కల్లూరుగూడెంలో ఫ్యాక్టరీ నిర్మాణానికి శంకుస్థాపన
వెంసూరు, వెలుగు : గత పాలకులు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసి వదిలేస్తే.. ఆ అప్పులకు వడ్డీలు కడుతూనే, రూ.33 వేల కోట్లు రైతులకు ఇచ్చిన హామీల మేరకు వాళ్ల అకౌంట్లలో జమ చేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు అన్నారు. ఖమ్మం జిల్లా వెంసూరు మండలం కల్లూరుగూడెంలో రూ.87 కోట్లతో నిర్మిస్తున్న ఆయిల్ పామ్ ఫ్యాక్టరీకి ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. సత్తుపల్లి నియోజకవర్గ కేంద్రం నుంచి కల్లూరుగూడెం వరకు స్థానిక ఎమ్మెల్యే మట్టా రాగమయి రైతులతో కలిసి ర్యాలీగా వచ్చి భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కల్లూరుగూడెంలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ అడ్డుకునేందుకు కొంతమంది బ్రోకర్లు కోర్టుల్లో పిటిషన్లు వేస్తున్నారని, ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఫ్యాక్టరీ నిర్మించి తీరుతామని స్పష్టం చేశారు. ఈ ఏడాది రాష్ట్రంలో చాలాచోట్ల ఆయిల్ పామ్ సాగు చేశామని, ప్రధానిని కలిసి ఈ పంట కు మినిమం గ్యారంటీ ప్రైస్ పై పోరాడతామని చెప్పారు. వేర్వేరు దేశాల నుంచి ఆయిల్ పామ్ సీడ్స్ వచ్చాయని, ఇందులో నాసిరకం మొక్కలు కూడా ఉన్నాయని, వాటిపై ఆ కంపెనీల నుంచి నష్టపరిహారం వసూలు చేశామని తెలిపారు.
మహబూబాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో కూడా ఆయిల్ పామ్ ఫ్యాక్టరీలు నిర్మిస్తామన్నారు. సత్తుపల్లి నియోజకవర్గంలో కొత్తగా నిర్మించిన ప్రభుత్వ ఆస్పత్రులను వచ్చే నెలలో ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయిల్ ఫెడ్ రాష్ట్ర చైర్మన్ రాఘవరెడ్డి, ఆయిల్ ఫెడ్ ఎండీ యాసిన్ బాషా, ఆర్డీఓ రాజేందర్ గౌడ్, తహసీల్దార్ బాబ్జి ప్రసాద్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు మట్టా దయానంద్
తదితరులు పాల్గొన్నారు.
శాశ్వత వ్యవసాయ మార్కెట్ ఏర్పాటుకు వినతి
జూలూరుపాడు : జూలూరుపాడులో శాశ్వత వ్యవసాయ మార్కెట్ ఏర్పాటు చేయాలని ఆదివారం గండుగులపల్లిలోని మంత్రి తుమ్మల స్వగృహంలో జేఏసీ నాయకులు కలిసి వినతి పత్రం ఇచ్చారు. మండలంలో అత్యధికంగా పత్తి పంటను సాగుచేస్తున్నారని, రైతులకు అందుబాటులో ఉన్న ఉప మార్కెట్ ను శాశ్వత మార్కెట్‌గా ఏర్పాటు చేస్తే బాగుంటుందని వివరించారు. దీనికి మంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు భానోత్ ధర్మ, గుగులోత్ కేశవ నాయక్, నాగేశ్వరావు, మధు, శివ, శంకర్, నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.