వ్యవసాయంలో లేటెస్ట్‌ టెక్నాలజీ వాడాలి: మంత్రి తుమ్మల

వ్యవసాయంలో లేటెస్ట్‌ టెక్నాలజీ వాడాలి: మంత్రి తుమ్మల
  • రైతుల అభివృద్ధిలో ఇండో- జర్మన్‌ టెక్నాలజీ సహకారం గొప్పది: మంత్రి తుమ్మల
  • సెక్రటేరియట్‌లో జర్మన్‌ ప్రతినిధి బృందంతో భేటీ

హైదరాబాద్, వెలుగు: అగ్రి టెక్నాలజీలో ఇండో- జర్మన్‌ సహకారం రాష్ట్ర రైతాంగ అభివృద్ధికి కీలక ముందడుగు అని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. లేటెస్ట్ టెక్నాలజీతో వ్యవసాయ రంగాన్ని లాభదాయకం చేయాలన్నారు. గురువారం సెక్రటేరియట్‌లో జర్మన్‌ ప్రతినిధులతో మంత్రి భేటీ అయ్యారు. వేములవాడలో పైలట్ ప్రాజెక్ట్‌గా జర్మనీ సంస్థ హెచ్‌హెచ్‌ఐ సహకారంతో వ్యవసాయంలో లేటెస్ట్‌ టెక్నాలజీపై నిర్వహిస్తున్న పరిశోధనను మంత్రికి బృందం సభ్యులు వివరించారు.

లేటెస్ట్‌ టెక్నాలజీ అనుసంధానం, మార్కెటింగ్, డిజిటల్ వ్యవసాయ అభివృద్ధి వంటి తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రెండు దేశాల ప్రభుత్వాల సహకారంతో వ్యవసాయ రంగంలో నూతన ప్రణాళికలు చేపట్టాలన్నారు. వేములవాడ ప్రాజెక్ట్‌ను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి రైతులకు ప్రయోజనం చేకూర్చాలని పేర్కొన్నారు. అగ్రి హబ్ డిజిటల్ వ్యవసాయంపై అగ్రికల్చర్‌ వర్సిటీ దృష్టి పెట్టాలని సూచించారు. రాష్ట్రంలో పండించే పంటలు ఇంటర్నేషనల్ ఎక్స్‌పోర్ట్ ప్రమాణాలకు అనుగుణంగా పండించేలా రైతులను ప్రోత్సహించాలన్నారు.

జర్మనీ ప్రభుత్వంతో కలిసి అగ్రిహబ్, అగ్రివర్సిటీ ప్రాసెసింగ్ యూనిట్లు, ఎక్స్‌పోర్ట్ అవకాశాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ఆధునిక యంత్రాలతో కూలీల కొరతను అధిగమించడమే కాకుండా, అధిక దిగుబడులు పొందేలా సాగుకు టెక్నాలజీ అనుసంధానం చేయాలని మంత్రి తుమ్మల సూచించారు. జర్మన్‌ సహకారంతో రాజస్థాన్, ఒడిశా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో వివిధ ప్రాజెక్టులు నడుస్తున్నాయని జర్మన్‌ బృందం వివరించగా, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక అధ్యయన బృందాన్ని అక్కడికి పంపించి రైతులకు శిక్షణ ఇవ్వాలన్నారు.

ఏసీఆర్‌‌ఏటీ ప్రాజెక్టు రాష్ట్ర రైతులకు ఒక గొప్ప అవకాశమని తెలిపారు. ఫ్రాన్ హోఫర్ బృందంతో అగ్రి, వర్సిటీలు సమిష్టిగా పనిచేయాలన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ (ఏఐ)ను ఉపయోగించి అధిక దిగుబడి, ఫుడ్‌ ప్రాసెసింగ్, మార్కెట్ లింకేజ్ వంటి అంశాలను అభివృద్ధి చేయాలని సూచించారు. సమావేశంలో అగ్రికల్చర్ సెక్రటరీ రఘునందన్‌రావు, డైరెక్టర్ గోపి పాల్గొన్నారు.