వ్యవసాయ ఉత్పత్తులను విదేశాలకు ఎక్స్ పోర్ట్ చేస్తం : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

వ్యవసాయ ఉత్పత్తులను విదేశాలకు ఎక్స్ పోర్ట్ చేస్తం : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యవసాయ ఉత్పత్తులను ప్రపంచ దేశాలకు ఎక్స్ పోర్ట్  చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సోమవారం బహ్రెయిన్  చాంబర్  ఆఫ్  కామర్స్ ప్రతినిధులతో హైదరాబాద్ లోని లులు మాల్ లో ఆయన  సమావేశమయ్యారు. మంత్రి మాట్లాడుతూ వ్యవసాయ, ఆహార ఉత్పత్తులతో పాటు వాణిజ్య ఉత్పత్తులకు తెలంగాణ అనుకూలమన్నారు. 

  తమ ప్రభుత్వం స్నేహపూర్వక వాతావరణంతో వ్యాపార, వాణిజ్య, ద్వైపాక్షిక సంబంధాలు మెరుగు పరుచుకోవడానికి సుముఖంగా ఉందని స్పష్టం చేశారు. ప్రధానంగా వ్యవసాయ ఉత్పత్తులతో పాటు ఆహార ఉత్పత్తులు, పుడ్ ప్రాసెసింగ్ తో పాటు టెక్స్ టైల్  తదితర రంగాల్లో ట్రేడింగ్ కు రాష్ట్రం అనుకూలమని పేర్కొన్నారు. గ్లోబల్ మార్కెట్ కు తెలంగాణ క్వాలిటీ హబ్ గా మారిందని వెల్లడించారు. బహ్రెయిన్  చాంబర్  ఆఫ్  కామర్స్  ప్రతినిధి బహిరన్  అంబాసిడర్  అబ్దుల్  రెహమాన్  మహమ్మద్  అల్ గాడ్  మాట్లాడుతూ.. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక, వ్యాపార, వాణిజ్యం సంబంధాలు మెరుగపరుచుకోవడానికి లులు హైపర్ మార్కెట్  వారధిగా మారిందన్నారు. 

 బహ్రెయిన్  చాంబర్  ఆఫ్  కామర్స్  వైస్ చైర్మన్  మహమ్మద్ ఆల్కోహేజీ  మాట్లాడుతూ ఇండియా, బహ్రెయిన్  మధ్య ఎన్నో ఏళ్లుగా వ్యాపార, వాణిజ్య సంబంధాలు బలంగా ఉన్నాయన్నారు. లులు హైపర్ మార్కెట్  లోకల్ గ్లోబల్  ప్రొడక్టులను త్వరలో అందరికీ అందుబాటులోకి తీసుకువస్తుందని తెలిపారు. ఇక్కడ వాణిజ్య సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని చెప్పారు.