ఖమ్మం, వెలుగు : ఖమ్మం నియోజకవర్గంలో ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లాకు వచ్చిన హౌసింగ్ కమిషనర్, స్వచ్ఛదనం– పచ్చదనం కార్యక్రమం జిల్లా ప్రత్యేక అధికారి వీపీ గౌతమ్, కలెక్టర్ ముజామ్మిల్ఖాన్, మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య మర్యాదపూర్వకంగా మంత్రి తుమ్మల నాగేశ్వరావును కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ భూములను సంరక్షించడంతో పాటు ప్రభుత్వ, ప్రజా అవసరాల కోసం వినియోగించాలని అన్నారు.
ఖమ్మం నగరంతో పాటు రఘునాధపాలెం మండలంలోని ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం కాకుండా చూడాలన్నారు. గోళ్లపాడు ఛానెల్ పెండింగ్ పనులు నాణ్యత ప్రకారం పూర్తి చేయాలని సూచించారు. వెలుగుమట్ల అర్బన్ పార్కును ఏకో టూరిజం పార్కుగా చేయాలన్నారు. పార్క్ వెళ్లేందుకు డబుల్ రోడ్డువేయాలని చెప్పారు.
జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉన్న నేపథ్యంలో ఖమ్మం నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని సూచించారు. ఖమ్మంలో మరో ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని చూడాలని చెప్పారు. స్వచ్ఛదనం–పచ్చదనం కార్యక్రమంలో జిల్లాను అగ్రస్థానంలో నిలిపేలా అధికార యంత్రాంగం కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ మేయర్ పునుకొల్లు నీరజ, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
జక్కంపూడి సంస్మరణ సభకు మంత్రి హాజరు..
తల్లాడ : జక్కంపూడి ఫ్యామిలీ జీవితం ప్రజా సేవకే అంకితం చేశారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. తల్లాడ మండలం బిల్లుపాడు కు చెందిన సీనియర్ నాయకుడు ప్రజల మనిషి జక్కంపూడి కృష్ణమూర్తి, ప్రేమలత దంపతులు ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. వారి దశదినకర్మ గురువారం తల్లాడ ఆర్ బీ గార్డెన్ లో జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సంస్మరణ సభలో మంత్రి మాట్లాడుతూ కృష్ణమూర్తి 42 ఏళ్ల రాజకీయ జీవితం గొప్పదని, ఆయన కాంగ్రెస్లో ఉన్నా టీడీపీ ద్వారా తాను మొదటి పోటీ చేసినప్పుడు తన విజయం కోసం పని చేశారని గుర్తుచేశారు.
సత్తుపల్లిని ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారో.. అదే విధంగా తల్లాడ మండలాన్ని అభివృద్ధి చేయాలని తనతో కొట్లాడేవాడని చెప్పారు. మంత్రి వెంట వైరా, కొత్తగూడెం ఎమ్మెల్యేలు రాందాస్ నాయక్, కూనం నేని సాంబశివరావు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పూవ్వాళ్ల దుర్గాప్రసాద్, జిల్లా కాంగ్రెస్ నాయకుడు మట్టా దయానంద్, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ ఉన్నారు.