ఖమ్మంలో అభివృద్ధి పనులు ఇన్​టైంలో పూర్తి చేయాలి : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ఖమ్మంలో అభివృద్ధి పనులు ఇన్​టైంలో పూర్తి చేయాలి : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ఖమ్మం టౌన్, వెలుగు  :  ఖమ్మం నగరంలో ప్రతిపాదించిన అభివృద్ధి పనులను నాణ్యతతో సకాలంలో పూర్తి చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం కేఎంసీ పరిధిలోని 8వ డివిజన్ లో బల్లెపల్లి నుంచి బాలాపేట వరకు చేపట్టిన రోడ్డు విస్తరణ  పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రూ.3.95కోట్లతో బల్లెపల్లి నుంచి బాలాపేట వరకు రోడ్డు విస్తరణ పనులు చేపట్టామన్నారు. 

గతంలో వచ్చిన వరద పరిస్థితులు పునరావృతం కావద్దని రూ.249 కోట్లతో డ్రైయిన్ పనులు శనివారం నుంచి ప్రారంభిస్తున్నామని చెప్పారు. స్లాటర్ హౌస్ నిర్మాణానికి రూ.8 కోట్ల నిధులు అందుబాటులో ఉన్నాయని, దీనికి అనువైన స్థలాన్ని వెంటనే ఎంపిక చేసి పనులు ప్రారంభించాలని కమిషనర్ కు సూచించారు. సర్దార్ పటేల్ స్టేడియంలో అథ్లెటిక్స్ క్రీడల మౌలిక వసతుల కల్పనకు రూ.8.05కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులకు గణతంత్ర దినోత్సవం రోజు శంకుస్థాపన చేయాలని చెప్పారు.

నగరంలోని మున్సిపల్ పార్కు అభివృద్ధి రూ.కోటిమంజూరు చేస్తున్నామని తెలిపారు. వెలుగుమట్ల అర్బన్ పార్క్ కు రోడ్డు పనులు, ఖమ్మం ఖిల్లా రోప్​వే పనులు స్పీడప్​ చేయాలని ఆదేశించారు. రఘునాథపాలెం మండలంలోని 30 చెరువులను ఉగాది నాటికి మంచుకొండ ఎత్తిపోతల పథకం ద్వారా నింపుతామని హామీ ఇచ్చారు. కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య మాట్లాడుతూ కార్పొరేషన్ లో విలీన ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టితో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. చెత్త తరలింపు వాహనాలకు జీపీఎస్ ఏర్పాటు చేశామని, శానిటరీ ఇన్స్ పెక్టర్ పని తీరును సైతం పర్యవేక్షిస్తున్నామని చెప్పారు.
 
నగర పురపాలక 

సంస్థ పని తీరు పై సలహాలు, సూచనలు, ఫిర్యాదులు స్వీకరించేందుకు నగరంలో పలు ప్రదేశాలలో క్యూఆర్ కోడ్,  మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఫోన్ నెంబర్ 8333833696 ఏర్పాటు చేశామని, వీటికి వచ్చే ఫిర్యాదులను 24 గంటలలో పరిష్కరిస్తామని తెలిపారు. ఖమ్మం సరిహద్దుల్లో ఏడుచోట్ల  స్వాగత బోర్డులతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు.  రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం కేఎంసీ కార్యాలయంలో 25న ప్రత్యేక క్యాంపు ఏర్పాటు చేస్తున్నామని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, నగర మేయర్ పునుకొల్లు నీరజ, జడ్పీ సీఈవో దీక్షా రైనా, ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు,  8వ డివిజన్ కార్పొరేటర్ లకావత్ సైదులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.