- కార్పొరేషన్ విధులు పక్కాగా నిర్వహించాలి
- మున్సిపల్ అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశం
- కేఎంసీ కార్యకలాపాలపై సమీక్షా సమావేశం
ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం నగరంలోని పలు డివిజన్లలో, కమర్షియల్ సెంటర్లలో రోడ్లను ఆక్రమిస్తుంటే సైలెంట్‌గా ఉండడమేంటి, వెంటనే చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. నగరంలో ట్రాఫిక్ సమస్య లేకుండా చూడాలన్నారు. గురువారం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్, మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పునుకొల్లు నీరజ, మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య తో కలిసి కేఎంసీ కార్యకలాపాలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కార్పొరేషన్ లో విలీనమైన పంచాయతీల్లో కార్మికుల కొరత, తాగు నీటి సమస్యలు, ఫాగింగ్ యంత్రాలు, పనిముట్లపై ఫిర్యాదులు అందుతున్నాయని, ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. పార్కు, జంక్షన్ల నిర్వహణ మెరుగ్గా నిర్వహించాలని సూచించారు. ప్రైవేట్ స్థలాల్లో చెత్త చేరడానికి వీలు లేదన్నారు. ప్రభుత్వ సంస్థల్లో ఇంకుడు గుంతల నిర్మాణం పూర్తి చేయాలని చెప్పారు. స్లాటర్ హౌస్ కు స్థలాన్ని ఎంపిక చేయాలని ఆర్డీవో ను ఆదేశించారు.
ఖమ్మంలో కొత్తగా తాగునీటి కోసం ఏం చేయాలి, అమృత్ కింద ఎలా చేపట్టాలనే వివరాలతో నివేదిక ఇవ్వాలని మున్సిపల్ కమిషనర్ కు సూచించారు. వర్షాకాలం నగరంలో వరదల నియంత్రణకు చేపట్టాల్సిన పనులను స్పీడప్ చేయాలన్నారు. గంజాయి విక్రయాలు చేసే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని చెప్పారు. వర్షాకాలం రాకముందే ధంసలాపురం ఫ్లై ఓవర్ తో సహా రాజమండ్రి రహదారి పూర్తి కావాలన్నారు.
శానిటేషన్ పై ప్రత్యేక శ్రద్ధ
కార్పొరేషన్ పరిధిలో పారిశుధ్య నిర్వహణ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామని కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ తెలిపారు. పారిశుధ్య సిబ్బంది అటెండెన్స్ ను పర్యవేక్షిస్తున్నామని, ప్రతీ వాహనాన్ని జీపీఎస్ ట్రాకర్ ద్వారా మానిటరింగ్ చేస్తున్నామని చెప్పారు. డివిజన్ లో ఎటువంటి చెత్త వస్తుందని గమనించి పారిశుధ్య ప్రొఫైల్ ప్రతీ డివిజన్ కు తయారు చేస్తున్నామన్నారు.
మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య మాట్లాడుతూ ప్రతీ డివిజన్ సంబంధించిన వాటర్ మ్యాన్, లైన్ మ్యాన్, పారిశుద్ధ్య సిబ్బంది వివరాలు ప్రజలకు తెలిసేలా గోడలపై రాశామని తెలిపారు. కార్పొరేషన్ లో పారిశుధ్య కంట్రోల్ రూమ్ శుక్రవారం నుంచి ప్రారంభిస్తామన్నారు. పోస్టాఫీసు అధికారులతో సమన్వయం చేసుకుంటూ పారిశుధ్య సిబ్బంది జీవిత బీమా కల్పనకు చర్యలు చేపట్టామని తెలిపారు. ఈ సమావేశంలో డీఎఫ్‌వో సిద్దార్థ్ విక్రమ్ సింగ్, అడిషనల్ కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
నిర్వాసితుల ఇండ్ల పనులు ప్రారంభించాలి
రైల్వే 3వ లైన్ కింద ఇండ్లు కోల్పోయిన నిర్వాసితులకు వారికి కేటాయించిన స్థలాలలో ఇంటి నిర్మాణాలు వెంటనే ప్రారంభించాలని మంత్రి తుమ్మల అధికారులను ఆదేశించారు. భూములు కోల్పోయిన వారికి గురువారం రఘునాథపాలెం మండలం వెంకటాయపాలెంలో ఇండ్ల పట్టాలు, పరిహారం అందజేశారు. ఇండ్లను కోల్పోయిన 58 మందికి వెంకటాయపాలెంలో 75 గజాల చొప్పున ఇండ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నామని మంత్రి తెలిపారు.
అభివృద్ధి పనులు పూర్తి చేయాలి
ప్రస్తుతం చేపట్టిన అభివృద్ధి పనులు ఉగాది లోపు పూర్తి చేయాలని మంత్రి తుమ్మల అధికారులను ఆదేశించారు. కేఎంసీ పరిధిలోని నర్తకి థియేటర్ రోడ్డులోని డివిజన్ 32, 36 లో రైల్వే నిధులు రూ.3.3 కోట్లతో చేపడుతున్నసీసీ రోడ్డు, కాల్వ, పైప్ లైన్ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.