పామాయిల్ పరిశ్రమ పనులు ప్రారంభించాలి :  మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

పామాయిల్ పరిశ్రమ పనులు ప్రారంభించాలి :  మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
  • ఆయిల్ ఫెడ్ అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశం 

ఖమ్మం టౌన్, వెలుగు :  ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం అంజనపురంలో నిర్మించే పామాయిల్ పరిశ్రమ పనులను వెంటనే చేపట్టాలని గోద్రెజ్ ఆయిల్  ఫెడ్ అధికారులును మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. మంగళవారం ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో గోద్రెజ్ కంపెనీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు అధికమవుతుందని, ప్రైవేట్ రంగంలో కూడా పామాయిల్ పెంపకాన్ని పర్సనల్ గా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు.

తెలంగాణలో 10 లక్షలు ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగుచేయ బోతున్నామని చెప్పారు. పరిశ్రమ మ్యాప్ ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో గోద్రెజ్  ఆయిల్ ఫెడ్ అధికారులు సౌగత్ అయోగ్ చావా, వెంకటేశ్వరరావు, పామాయిల్ రైతు నాయకులు గుత్తా వెంకటేశ్వరరావు, తాతా రఘునాథ్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు దుర్గాప్రసాద్,  సొసైటీ అధ్యక్షుడు రావూరి సైదుబాబు తదితరులు పాల్గొన్నారు. 

రైతులే కూరగాయల వ్యాపారం చేసేలా చర్యలు

కూరగాయలను పండించే రైతులే నేరుగా వచ్చి రైతు బజార్ లో వ్యాపారం చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల అధికారులకు సూచించారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 44వ డివిజన్ లో పాత అగ్రికల్చర్ మార్కెట్ స్థలంలో మున్సిపల్​ సాధారణ నిధులు రూ.41.50లక్షలతో చేపట్టిన  షెడ్లు, ప్లాట్ పామ్ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం వైఎస్ఆర్ నగర్ లో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి మాట్లాడారు. ఖమ్మం నగరంలో విలీనమైన, నూతన కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలన్నారు.

వైఎస్సార్ కాలనీ ప్రజల అభ్యర్థన మేరకు ఈనాడు కార్యాలయం వద్ద రిక్వెస్ట్ బస్ స్టాప్, బస్ షెల్టర్ ఏర్పాటు చేయాలని ఖమ్మం ఆర్టీసీ అధికారులను ఫోన్ లో ఆదేశించారు. ఎస్ఆర్ గార్డెన్స్ నుంచి వైఎస్సార్ నగర్ కాలనీ వైపు నుంచి మండలానికి వెళ్లే రోడ్డులో బస్సు సౌకర్యం కల్పించాలని సూచించారు. అనంతరం సీఎం కప్ క్రీడా పోటీల బ్రోచర్, లోగోను ఆవిష్కరించారు  ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతీమా జోహారా, ఆర్డీవో నరసింహా రావు, 8వ డివిజన్ కార్పొరేటర్ లకావత్ సైదులు, కార్పొరేటర్లు కమర్తపు మురళీ, కొత్తపల్లి నీరజ, జిల్లా యువజన, క్రీడా సంక్షేమ శాఖ అధికారి సునీల్ రెడ్డి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.