- అధికారులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలు
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో రానున్న నెల రోజులు వరి కొనుగోళ్లలో వేగం పెంచాలని అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. అందుకు తగ్గట్లు యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలన్నారు. కో ఆపరేటీవ్, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ ఉదయ్ కుమార్ తో కలిసి ఆయన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి వరకు పని చేస్తున్న కో ఆపరేటీవ్, డీసీఎంఎస్ అధికారులు, మార్కెటింగ్ అధికారులకు వీడియా కాన్ఫరెన్స్ ద్వారా ప్రభుత్వ ఆదేశాలు వెళ్లేలా చూడాలని కోరారు.
అన్ని కొనుగోలు కేంద్రాల వద్ద సౌకర్యాలు, రుణ సదుపాయాలు కల్పించాలన్నారు. కొన్న వడ్లను తరలించడానికి గోదాముల గుర్తింపు, మార్కెటింగ్ అధికారులతో స్టేట్ వేర్ హౌస్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ, ఏ రోజుకారోజు వడ్లను తరలించాలని సూచించారు. కొనుగోలు సెంటర్లలో వడ్లను ఆరబోసుకోవడానికి, తాలు, చెత్త తీయడానికి క్లీనర్లు, విన్నోయింగ్ ఫ్యాన్లు ఏర్పాటు చేయాలన్నారు. సన్నవడ్లను గుర్తించే పరికరాలు అన్ని సిద్ధం చేయాలని..రైతులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఆఫీసర్లను మంత్రి ఆదేశించారు.