సీతారామ ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన రైతులకు పాదాభివందనం: మంత్రి తుమ్మల

సీతారామ ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన రైతులకు పాదాభివందనం: మంత్రి తుమ్మల

ఖమ్మం: సీతారామ ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన రైతులకు మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు పాదాభివందనాలు తెలిపారు. బుధవారం (మార్చి 5) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వినోబానగర్ వద్ద రాజీవ్ సాగర్ లింకు కెనాల్‎కు నీటిని విడుదల చేసి మంత్రి తుమ్మల గోదావరి నీళ్లకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముందుగా ఈ ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన రైతులకు ధన్యవాదాలు తెలిపారు. 

గత ప్రభుత్వంలో సీతారామ ప్రాజెక్టు జూలూరుపాడు నుంచి టెన్నెల్ ద్వారా గోదావరి జలాలను తరలింపు కోసం డిజైన్ చేశారు. కానీ ఖమ్మం జిల్లాలోని ఎన్ఎస్‎పీ కెనాల్‎తో సీతారామ ప్రాజెక్టు కెనాల్ ద్వారా గోదావరి జలాలను జూలూరుపాడు మండలం వినోభనగర్ వద్ద రాజీవ్ లింక్ కెనాల్‎తో వైరా, సత్తుపల్లి ప్రాంతానికి సాగునీరు అందిస్తామన్నారు. ఈ ప్రాజెక్టు లింక్ కెనాల్ ఏర్పాటుకు సహకరించిన ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. 

రాబోయే రోజుల్లో ఉమ్మడి జిల్లాలో ఎక్కువ భూములకు గోదావరి జలాలు అందించే విధంగా కృషి చేస్తానని పేర్కొన్నారు. గతంలో ప్రాజెక్టుల నిర్మాణానికి భూములు కోల్పోయిన రైతుల కాళ్లకు మొక్కాను.. ఇప్పుడు ఈ సీతారామ ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన రైతులకు పాదాభివందనాలు తెలియజేస్తున్నానని అన్నారు. ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన రైతులకు సన్మానం చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి తుమ్మల. అలాగే.. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించిన ఇద్దరు కలెక్టర్లకు, ఇరిగేషన్ అధికారులకు ధన్యవాదాలు  తెలిపారు. త్వరలోనే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అనేక రహదారులను పూర్తి చేస్తామన్నారు.