పూసుకుంట, కటుకూరు అభివృద్ధికి కృషి : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 

  • గ్రామాల్లో పర్యటన..పలు పనులకు శంకుస్థాపనలు

దమ్మపేట,  వెలుగు: పూసుకుంట, కటుకూరు గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఈ గ్రామాల ప్రజలు అన్ని రంగాల్లో ముందుండాలన్నారు. శనివారం మండలంలోని దట్టమైన అటవీలో ఉన్న పూసుకుంట, కటుకూరు గ్రామాల్లో ఎంపీ రామ సహాయం రఘురామరెడ్డి, ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, కలెక్టర్ జితేశ్​వి పాటిల్, ఐటీడీఏ పీవో రాహుల్ తో కలిసి మంత్రి పర్యటించారు.

కటుకూరు గ్రామ పరిధిలో సుమారు రూ.1.30కోట్లతో హై లెవెల్ వంతెనల నిర్మాణ పనులు, పూసుకుంట అటవీలో నిర్మించబోయే మరో రెండు వంతెనల శిలాఫలకాన్ని, కటుకూరు నుంచి రాచన్నగూడెం వరకు 4.18కోట్లతో నిర్మించబోయే బీటీ రోడ్ల పనులు, పూసుకుంటలో ఓ రైతు వ్యవసాయ భూమిలో పామాయిల్ మొక్కలు నాటి, ఐటీడీఏ ద్వారా ఏర్పాటు చేసిన వ్యవసాయ విద్యుత్ మోటర్లు స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. అనంతరం పుసుకుంటలో ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. పూసుకుంట, కటుకూరు ప్రజల జీవితంలో వెలుగులు నింపడమే తన లక్ష్యమన్నారు. ఈ గ్రామాలకు రోడ్డు మార్గాన్ని మూడు నెలల్లో పూర్తిచేసి ఉగాది నాటికి ప్రారంభిస్తామని చెప్పారు.

.కొండరెడ్ల కాపాడుకుంటామని, వారిని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి ప్రత్యేక ప్రణాళికలు రచిస్తున్నామని తెలిపారు. త్వరలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పారు. పూసుకుంట, కటుకూరు గ్రామాల్లో ఉన్నా ప్రతి చిన్నారి చదువుల్లో రాణించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఎంపీ రఘురాంరెడ్డి మాట్లాడుతూ పూసుకుంట, కటుకూరు గ్రామాలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. ప్రభుత్వం అందించే ప్రతి పథకాన్ని అర్హులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం గిరిజన బాలికలకు దుస్తులు పంపిణీ చేశారు. 

సత్తుపల్లి పేరు చెడగొట్టొద్దు

సత్తుపల్లి :  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని సత్తుపల్లికి కీర్తి, ప్రతిష్టలు ఉన్నాయని, ఆ పేరును కోడిపందేలు, పేకాటలు ఆడి చెడగొట్టొద్దని మంత్రి తుమ్మల అన్నారు. పట్టణ పరిధిలోని వివేకానంద ఎక్సలెన్స్ భవనం, మండల పరిధిలోని రామ గోవిందాపురం పంచాయతీ కార్యాలయాన్ని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగామయితో కలిసి ఆయన ప్రారంభించారు.  

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మహేశ్, వైస్ చైర్మన్ తోట సుజల రాణి, డీసీవో గంగాధర్, డీపీవో ఆశలత, డీఎల్పీవో రాంబాబు, డిప్యూటీ సీఈవో నాగ పద్మజ, ఆర్డీవో రాజేంద్ర గౌడ్, ఎంపీడీవో నాగేశ్వరరావు, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ మట్టా దయానంద్, చల్లగుల్ల నరసింహారావు, ఉడతనేని అప్పారావు, రామకృష్ణ సేవా సమితి బాధ్యుడు చీకటి శ్రీనివాసరావు, నాయుడు వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.