ఖమ్మం, వెలుగు : ఖమ్మం నగరంలోని ధంసలాపురం దగ్గర ఖమ్మం టు దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే ఎంట్రీ, ఎగ్జిట్ పై నేషనల్ హైవే అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. బుధవారం నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్ డైరెక్టర్ దుర్గా ప్రసాద్, ఇతర అధికారులతో డిజైన్స్ పై చర్చించారు. ధంసలాపురం దగ్గర ఎంట్రీ, ఎగ్జిట్ కు సంబంధించి మంత్రి తుమ్మలకు అధికారులు రెండు డిజైన్లు సమర్పించారు. రైతులు నష్టపోకుండా తక్కువ భూసేకరణ ఉండే డిజైన్ ను పరిశీలించి, ఆ డిజైన్ ఆమోదించాల్సిందిగా ఉన్నతాధికారులకు తుమ్మల సూచించారు.
త్వరగా భూ సేకరణ చేసి నేషనల్ హైవే అధికారులకు అప్పగించాల్సిందిగా కలెక్టర్ కు చెప్పారు. డిజైన్స్ త్వరగా ఆమోదింపజేసి ఖమ్మం, దేవరపల్లి హైవే మిగిలిన పనులు పూర్తయ్యే లోపు ధంసలాపురం బ్రిడ్జి ఎంట్రీ, ఎక్సీట్ పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఎన్హెచ్ఏఐ ఆఫీసర్లను ఆదేశించారు. ముదిగొండ నుంచి వెంకటగిరి మధ్య బ్లాక్ స్పాట్స్ ఉన్నందున నాలుగు లైన్ల రహదారిగా విస్తరించి స్టేట్ హైవే కు అప్పగించాల్సిందిగా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా రీజనల్ ఆఫీసర్ రజాక్ కు మంత్రి తుమ్మల లేఖ రాశారు.