22 లక్షల మంది రైతులకు రుణమాఫీ ఎగ్గొట్టింది

22 లక్షల మంది రైతులకు రుణమాఫీ ఎగ్గొట్టింది
  • బీఆర్ఎస్ సర్కారు పదేండ్లలో ఒక్క పథకాన్నీ సక్కగ అమల్జేయలే: మంత్రి తుమ్మల 
  • ఇప్పుడు మైకుల ముందు గొంతు చించుకుంటున్నరు
  • అర్థంపర్థం లేని ఆరోపణలతో రైతులను పరేషాన్  చేస్తున్నరని మండిపాటు

హైదరాబాద్, వెలుగు: పదేండ్లలో ఒక్క పథకాన్ని కూడా సక్కగ అమలు చేయని పెద్దలు, పది నెలలు గడవక ముందే మైకుల ముందుకొచ్చి గొంతు చించుకుంటున్నారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం మీడియాకు ప్రకటన విడుదల చేశారు. ఆగస్టు 15 కల్లా ఇచ్చిన మాట ప్రకారం రూ.2 లక్షలలోపున్న రైతులకు రుణమాఫీ చేశామన్నారు.

మొదటి పంట కాలంలోనే 22 లక్షల మందికి రూ.18 వేల కోట్లు ఒకే విడతలో మాఫీ చేశామన్నారు. కుటుంబ నిర్ధారణ కానివాళ్ల వివరాలు సేకరిస్తున్నామని, ఇప్పటికే 2.65 లక్షల మంది వివరాల సేకరణ పూర్తయిందన్నారు. ఈ 9 నెలలల్లోనే రూ. 26,140.13 కోట్లు రైతుల కోసం ఖర్చు చేశామన్నారు. 

మీది రుణమాఫీ పేరిట వంచన

రైతాంగానికి బీఆర్ఎస్​ రుణమాఫీ పేరుతో వంచన చేస్తేనే ఎన్నికల్లో కర్రు కాల్చి వాతలు పెట్టారని మంత్రి తుమ్మల కామెంట్ చేశారు. లక్ష రుణమాఫీకే 4 వాయిదాలు తీసుకొని, రెండోసారి సగం మందికి కూడా మాఫీ చేయలేదని విమర్శించారు. ‘‘మీరు అధికారంలో ఉన్నప్పుడు వడ్డీ మాఫీని ప్రస్తావించే ధైర్యం లేక మా ప్రభుత్వం అమలు చేస్తున్న రుణమాఫీపై అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తూ రైతులను ఆందోళనలకు గురి చేస్తున్నరు”అని మండిపడ్డారు.

2023 దాకా నాన్చి సగం మందికే ఇచ్చి, 20.84 లక్షల మంది రైతులకు రుణమాఫీ ఎగ్గొట్టిన విషయం నిజం కాదా? అని ప్రశ్నించారు. చేసిన సగం మందిలో 2.26 లక్షల మంది రైతులకు సంబంధించిన రూ.1,419 కోట్ల మాఫీ సొమ్మును ఖజానాకు వచ్చినా వాటిని తిరిగి రైతుల ఖాతాలకు చెల్లించే ప్రయత్నం చేయలేదన్నారు.

నేడు సీఎం చేతుల మీదుగా ఐఐహెచ్​టీ ప్రారంభం: తుమ్మల

యువతకు చేనేత రంగంలోని కొత్త టెక్నాలజీలో శిక్షణ ఇచ్చేందుకు ఇండియన్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్​ హ్యాండ్లూమ్​ టెక్నాలజీ(ఐఐహెచ్​టీ)ని ఏర్పాటు చేస్తున్నట్టు చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సోమవారం నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ లో లలిత కళాతోరణంలో సీఎం రేవంత్ రెడ్డి ఐఐహెచ్ టీని ప్రారంభిస్తారని చెప్పారు. దేశంలోని ఆరు ప్రదేశాల్లో మాత్రమే ఐఐహెచ్​టీలు ఉన్నాయన్నారు. ఇప్పటి వరకు ఐఐహెచ్​టీ లేకపోవడంతో ఇక్కడి యువత ఆంధ్రాలోని వెంకటగిరి, ఒడిశాలోని బర్గాకు వెళ్లాల్సి వచ్చేదని వివరించారు.

తెలంగాణలో ఐఐహెచ్​టీ ఏర్పాటుతో ఏటా 60 మంది విద్యార్థులకు హ్యాండ్లూమ్, టెక్స్ టైల్ టెక్నాలజీలో డిప్లొమా కోర్సులో శిక్షణ ఇస్తామన్నారు. తర్వాత వారికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉపాధి అవకాశాలు దక్కుతాయన్నారు. ఈ మీటింగ్​లో నేతన్నకు చేయూత పథకం కింద 36,133 మంది లబ్ధిదారులకు రూ.290 కోట్లు విడుదల చేస్తామని మంత్రి తెలిపారు.