- ‘రైతు పండుగ’లో సీఎం రేవంత్ శుభవార్త చెప్తారని వెల్లడి
మహబూబ్‌నగర్, వెలుగు : రైతులు పామాయిల్ సాగు చేయాలని.. ఆ పంట ద్వారా లాభాలకు తాను భరోసా ఇస్తున్నునని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఈ పంట సాగు వల్ల రైతుల జీవితాల్లో వెలుగులు నిండకుంటే ఏ శిక్షకైనా సిద్ధమని చెప్పారు. మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలం అమిస్తాపూర్ గ్రామం వద్ద ఏర్పాటు చేసిన ‘రైతు పండుగ వ్యవసాయ ప్రదర్శన’ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రి చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. ప్రదర్శనలో ఏర్పాటు చేసిన 155 స్టాల్స్‌ను పరిశీలించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన సభలో తుమ్మల మాట్లాడారు.
‘రైతులారా.. పామాయిల్ సాగు చేయండి. మీ లాభాలకు మాదీ భరోసా. మొదటి మూడేండ్లు మీకు పెట్టుబడి పెట్టే బాధ్యత కూడా మాదే. అంతర్గత పంటలు వేస్తే, వాటికి కూడా బోనస్ చెల్లిస్తం. మీ పంటలను ఇండ్ల కాడే కొంటం. వెంటనే డబ్బులు చెల్లిస్తం. ఈ పంట సాగుకు కోతులు, దొంగలు, అడవి పందుల బాధ ఉండదు’ అని అన్నారు. అలాగే డ్రాగన్ ప్రూట్, జాజ్, వక్కతో పాటు విభిన్న రకాల పంటలు సాగు చేయాలన్నారు. రాష్ట్రం అన్ని పంటలు సాగుచేసే స్థితికి ఎదగాలన్నారు. పంటలపై అవగాహన కల్పించేందుకు ఈ రైతు సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు.
Also Read:-రెయిడ్‌కు వెళ్లిన ఈడీ టీమ్‌పై ఎటాక్..సైబర్ క్రైమ్ కేసులో నిందితుల దుశ్చర్య
సీఎం రేవంత్ రెడ్డి కోరిక మేరకు పాలమూరులో ఈ సదస్సులను ప్రారంభించామన్నారు. శనివారం జరగనున్న ‘రైతు పండుగ’ సభలో సీఎం రేవంత్‌రెడ్డి.. ఈ నాలుగేండ్లలో రైతుల కోసం చేపట్టబోయే కార్యక్రమాల గురించి వివరిస్తారన్నారు. అలాగే వారికి శుభవార్త కూడా చెప్పనున్నారని తెలిపారు. భారీగా రైతులను సమీకరించి ‘రైతు పండుగ’ను విజయంతం చేయాలని పిలపునిచ్చారు.
రైతుల బాధలు కాంగ్రెస్‌కు తెలుసు
‘‘రైతుల కష్టాలు, సాదకబాధకాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలుసు. ప్రభుత్వం, నాయకుడు చిరస్థాయిగా నిలబడాలంటే కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. ఆ నిర్ణయాలు రైతుకు సంబంధించినవి ఉండాలి. అలాంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. వ్యవసాయానికి 33 శాతం బడ్జెట్ కేటాయించారు. ప్రతి ఏడాది చర్చా వేదికలను ఏర్పాటు చేసి, నిష్ణాతులైన రైతుల ద్వారా ఆధునిక మెలకువలు, సైంటిఫిక్ టెక్నిక్ తదితర వాటిపై అవగాహన కల్పించాలి’’ - మంత్రి దామోదర రాజనర్సింహ
వడ్లు అమ్మిన 3 రోజులకే డబ్బులు
‘‘ప్రభుత్వ కొనుగోలు సెంటర్లో వడ్లు అమ్మిన మూడు రోజుల్లోనే రైతుల అకౌంట్లలో వాటికి సంబంధించిన డబ్బులు వేస్తున్నం. రైతులు సేంద్రియ వ్యవసాయం చేయడం వల్ల పెట్టుబడులు తగ్గి లాభాలు పెరుగుతాయి. దీనిపై ప్రదర్శనలో చాలా స్టాల్స్ ఏర్పాటు చేశాం. రైతులు వాటిని సందర్శించి స్ఫూర్తిని పొందాలి’’
– మంత్రి జూపల్లి కృష్ణారావు