తెలంగాణ నుంచి నూకలు కొంటాం...మా దేశంలో మస్త్ డిమాండ్ ఉంది: మలేషియా  

తెలంగాణ నుంచి నూకలు కొంటాం...మా దేశంలో మస్త్ డిమాండ్ ఉంది: మలేషియా  
  • యాసంగికల్లా బ్రోకెన్ రైస్ ఎగుమతికి సిద్ధం: మంత్రి తుమ్మల 
  • మలేషియాలో పర్యటన

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగును విస్తరించేందుకు ఈ రంగంలో అగ్రగామిగా ఉన్న మలేషియా సహకారం తీసుకుంటామని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. మలేషియాలో బ్రోకెన్ రైస్​కు చాలా డిమాండ్ ఉందని, తెలంగాణ నుంచి బ్రోకెన్ రైస్ కొనుగోలుపై త్వరలోనే నిర్ణయం చెప్తామని ఆ దేశ ప్రతినిధులు తెలియజేయగా.. వచ్చే యాసంగికల్లా నూకల ఎగుమతికి సిద్ధం కావాలని అధికారులను మంత్రి తుమ్మల ఆదేశించారు.

ఆయిల్ పామ్ విస్తరణ అవకాశాలు, ప్రాసెసింగ్ ప్లాంట్ల నిర్వహణ, సాగులో అనుసరిస్తున్న సాంకేతిక విధానాలపై అధ్యయనం కోసం మంత్రి ఆధ్వర్యంలోని బృందం బుధవారం మలేషియా వెళ్లింది. పర్యటనలో భాగంగా ఆ దేశ ప్లాంటేషన్, కమోడిటీస్ మంత్రి జోహరి అబ్దుల్ ఘనీతో తుమ్మల భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగుకు అందిస్తున్న ప్రోత్సాహకాలు, ప్రస్తుత పరిస్థితి, రానున్న రోజుల్లో ఆయిల్ పామ్ పరిశ్రమ అభివృద్ధికి ఉన్న అవకాశాలు వివరించారు. మలేషియా మంత్రి ఘనీ మాట్లాడుతూ.. పామ్ ఆయిల్ వృద్ధికి తాము అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నామని తెలిపారు. త్వరలోనే మలేషియా ప్రతినిధి బృందం తెలంగాణలో పర్యటిస్తుందని తెలిపారు.  

బ్రోకెన్ రైస్​కు డిమాండ్.. 

మలేషియా మాట్రోయి చైర్మన్ డాటో సెరి రీజల్ మెరికన్ ను కూడా మంత్రి తుమ్మల బృందం కలిసింది. మలేషియాతో వ్యవసాయ, వ్యాపార రంగాల్లో అవకాశాలపై చర్చించింది. ఇండియాతో వ్యాపారాభివృద్ధికి తమ దేశం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని డాటో సెరీ తెలిపారు. మలేషియాలో బ్రోకెన్ రైస్​కు చాలా డిమాండ్ ఉందని, తెలంగాణ నుంచి బ్రోకెన్ రైస్ సరఫరాకు ఉండే అవకాశాలను పరిశీలించి త్వరలోనే తెలియజేస్తామని చెప్పారు.

మంత్రి తుమ్మల వెంటనే స్పందించి హాకా ఎండీ చంద్రశేఖర్ రెడ్డితో ఫోన్​లో మాట్లాడారు. బ్రోకెన్ రైస్ ఎగుమతికి సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ఆదేశించారు. వరి రైతులకు అదనపు ప్రయోజనం కలిగితే, వచ్చే యాసంగి కల్లా ఎగుమతి చెయ్యడానికి సిద్ధంగా ఉండాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.