విద్యతోనే పేదరికం నుంచి శాశ్వత విముక్తి : తుమ్మల

విద్యతోనే పేదరికం నుంచి శాశ్వత విముక్తి : తుమ్మల
  • మైనారిటీ సంక్షేమ దినోత్సవ వేడుకల్లో మంత్రి తుమ్మల

ఖమ్మం టౌన్, వెలుగు :  విద్య ద్వారానే పేదరికం నుంచి శాశ్వత విముక్తి లభిస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. సోమవారం ఖమ్మంలో నిర్వహించిన మైనారిటీ సంక్షేమ దినోత్సవానికి కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ తో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మైనారిటీ వర్గాల్లో ఆడ పిల్లలను బడికి పంపించాలంటే ఇబ్బంది పడే రోజుల నుంచి తమ పిల్లలను చదివిస్తే తప్ప భవిష్యత్​ ఉండదని భావించే వరకు మార్పు వచ్చిందన్నారు.

స్వాతంత్ర్యం వచ్చిన తరువాత మొట్ట మొదటి విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ పుట్టిన రోజును జాతీయ విద్యా దినోత్సవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు.  యంగ్ ఇండియా సమీకృత విద్యాలయాలను వేగంగా నిర్మిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర్ రావు, నగర మేయర్ పునుకొల్లు నీరజ, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి కస్తాల సత్యనారాయణ, జిల్లా మైనారిటీ విద్యా సంస్థల ప్రిన్సిపాల్ సీత మహాలక్ష్మి, ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, టీచర్లు పాల్గొన్నారు. 

పంద్రాగస్టు నాటికి మంచుకొండ ఎత్తిపోతల పథకం పూర్తి 

జిల్లాలో సాగునీటి వసతి లేని రఘునాథపాలెం మండలానికి రాబోయే పంద్రాగస్టు నాటికి మంచుకొండ ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీటి సరఫరాకు కృషి చేస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. అడిషనల్​ కలెక్టర్ పీ. శ్రీనివాసరెడ్డితో కలిసి అల్లిపురం ధంసలాపురం మధ్యలో ఉన్న ఖమ్మం ఔటర్ రింగ్ రోడ్డు ప్రదేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

ఖమ్మం నియోజకవర్గంలోని రఘునాథపాలెం మండలంలో సాగునీటి వసతి లేదని, ఎత్తైన ప్రాంతంలో ఉన్నందున సాగర్ నుంచి 66.33 కోట్లతో మంచుకొండ ఎత్తిపోతల పథకం మంజూరు చేశామని, వి.వెంకటాయపాలెం గ్రామం దగ్గర 13 కిలోమీటర్ల వద్ద పంపు ఏర్పాటు చేసి మంచుకొండ ఎత్తిపోతల ద్వారా రఘునాథపాలెం మండలంలోని 30 చెరువులకు నీటి సరఫరా చేస్తామని తెలిపారు. 

మంచుకొండ ఎత్తిపోతల పథకం పనులకు టెండర్లు వారం రోజుల్లో పిలిచి వచ్చే పంద్రాగస్టులోపు పనులు పూర్తి చేసి సాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం కారిడార్ లో భాగంగా సూర్యాపేట, ఖమ్మం వరకు నాలుగు లైన్ల హైవే నిర్మాణం పూర్తి చేశామని, ప్రస్తుతం ఖమ్మం నుంచి దేవరపల్లి వరకు గ్రీన్ ఫీల్డ్ నాలుగు లైన్ల హైవే మొత్తం 165 కిలోమీటర్లు 5 ప్యాకేజీల్లో చేపట్టినట్లు తెలిపారు. ఖమ్మం నుంచి కురవి రోడ్, కురవి నుంచి అమరావతి రోడ్డు కనెక్టెవిటి వస్తే ఖమ్మం పట్టణానికి రింగ్ రోడ్డు పూర్తవుతుందని, అమరావతి రోడ్డుకు సర్వీస్ రోడ్లు వేసే ప్రతిపాదనలు తయారు చేయాలన్నారు.