రోడ్డు నిర్మాణంలో నాణ్యత పాటించాలి

రోడ్డు నిర్మాణంలో నాణ్యత పాటించాలి

ఖమ్మం టౌన్,వెలుగు : సీసీ రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించాలని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. సోమవారం పట్టణంలోని 18వ డివిజన్ శ్రీరామ్ నగర్, నెంబర్10 లో రూ. కోటి 75 లక్షలతో సీసీ రోడ్డు పనులను ఆయన ప్రారంభించారు. రోడ్డు వెడల్పు  పనుల నాణ్యతలో ఎక్కడా రాజీ పడవద్దని అన్నారు. 

డ్రెయిన్ల పై షాపులు, ఆక్రమణలు చేపట్టవద్దని, ప్రజలకు ఇబ్బందులు కలుగుతాయని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర రావు, నగర మేయర్ పునుకొల్లు నీరజ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, ఇంచార్జ్ నగరపాలక సంస్థ కమీషనర్ డాక్టర్. పి. శ్రీజ, కార్పొరేటర్లు మందడపు లక్ష్మి మనోహర్, కార్పొరేటర్లు కమర్తపు మురళీ, మేడారపు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. 

 మంత్రి సురేఖకు తుమ్మల లేఖ

భద్రాద్రికొత్తగూడెం : జిల్లా అభివృద్ధిలో రోడ్లు కీలకం అని   మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. జిల్లాలో ఫారెస్ట్​ పర్మిషన్స్​ రాకపోవడంతో పలు రోడ్ల నిర్మాణాలకు ఇబ్బంది కలుగుతోందని అటవీశాఖ మంత్రి కొండా సురేఖకు ఆయన సోమవారం లేఖ రాశారు. జిల్లాలో రోడ్ల నిర్మాణాలతో గిరిజనుల అభివృద్ధికి ఎంతో అవసరం అని పేర్కొన్నారు. తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా మూడు దశల్లో 68 రోడ్లు మంజూరు చేయించానని తెలిపారు. వీటిలో 28 రోడ్ల నిర్మాణాలు పూర్తి చేశామన్నారు.

 18 రోడ్లు ప్రోగ్రెస్​లో ఉన్నాయని, ఆరు రోడ్లు రిజెక్ట్​ అయ్యాయన్నారు. మరో 8 రోడ్ల నిర్మాణాలకు ఫారెస్ట్​ పర్మిషన్స్​ రావాల్సి ఉందన్నారు. మారుమూల ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా రోడ్లను మంజూరు చేయించామన్నారు.  త్వరితగతిన పర్మిషన్స్​ వచ్చేలా ఫారెస్ట్​ మినిష్టర్​ చర్యలు తీసుకోవాలని ఆయన లేఖలో విజ్ఞప్తి చేశారు.