- సిటీ ప్రజలు మొక్కలు పెంచేలా ప్రోత్సహిస్తాం: మంత్రి తుమ్మల
- 17వ గ్రాండ్ నర్సరీ మేళా ప్రారంభం
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ ప్రజలు మొక్కలు పెంచుకునేలా సబ్సిడీలు అందిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. గ్రీనరీ పెంచే లక్ష్యంతో ఈ ఏడాది నుంచి టెర్రస్ గార్డెన్లను ప్రమోట్ చేస్తున్నామని వెల్లడించారు. గురువారం ఆయన నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో 17వ గ్రాండ్ నర్సరీ మేళా పేరిట నిర్వహిస్తున్న ఆల్ ఇండియా హార్టీకల్చర్ షోను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ..హార్టీకల్చర్ డిపార్ట్మెంట్ఆధ్వర్యంలో హైదరాబాద్ లో పెద్ద ఎత్తున రూఫ్ గార్డెనింగ్‌ను ప్రోత్సహిస్తామని ప్రకటించారు. ప్రజలు ఏ మాత్రం ఖాళీ స్థలం ఉన్నా కూరగాయలతో పాటు ఇతర మొక్కలు పెంచాలని పిలుపునిచ్చారు.
టెర్రస్ పై సాయంత్రం వేళ ఆహ్లాదంగా గడిపేలా గార్డెన్ ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. మానవ జీవితానికి, మనుగడకు పచ్చదనం అనివార్యమని అన్నారు. గ్రామీణ ప్రాంతాలలో ఎలా అయితే వ్యవసాయ క్షేత్రాలు ఉంటాయో అలాగే పట్టణ ప్రాంత ప్రజలు వీలైనంత ఎక్కువగా గ్రీనరీ పెంచుకోవాలని సూచించారు. పొల్యూషన్నుంచి ఉపశమనం పొందడానికి ఇంటినిండా మొక్కలు పెంచుకోవాలన్నారు. దేశ, విదేశాల నుంచి అరుదైన మొక్కలు, విత్తనాలు తీసుకువచ్చి ఒక వేదికగా నర్సరీ మేళాలో అందించడం అభినందనీయమని మంత్రి పేర్కొన్నారు.
నర్సరీమేళా ఇన్ చార్జ్ ఖాలీద్అహ్మద్ మాట్లాడుతూ..150స్టాల్స్ ఏర్పాటు చేశామన్నారు. రూ.20 నుంచి రూ.2.50 లక్షల ఖరీదైన మొక్కల వరకు అందుబాటులో ఉన్నాయని వివరించారు. మొక్కలను పెంచడానికి కావాల్సిన మెటీరియల్స్, ఆర్గానిక్ ఎరువులు, ఫెర్టిలైజర్స్, టెర్రకోట కుండీలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. కిచెన్ గార్డెన్, ఆర్ణమెంటల్ ప్లాంట్స్, మెడిసినల్ ప్లాంట్స్, చెట్లను పెంచడానికి కావాల్సిన మెటీరియల్ ను ప్రమోట్ చేసే విధంగా ఎగ్జిబిట్ చేశామన్నారు. కార్యక్రమంలో హార్టీకల్చర్ఆఫీసర్బాబు తదితరులు పాల్గొన్నారు.