తొలిరోజు11.50 లక్షల కుటుంబాలకు రుణమాఫీ: మంత్రి తుమ్మల

తొలిరోజు11.50 లక్షల కుటుంబాలకు రుణమాఫీ: మంత్రి తుమ్మల
  • ఈ నెల 18న లక్ష వరకున్న లోన్లు మాఫీ: మంత్రి తుమ్మల
  • సాయంత్రంలోగా రైతుల రుణ ఖాతాల్లోకి డబ్బులు 
  • రూ.6 వేలకోట్లకు పైగా బ్యాంకు ఖాతాల్లో జమ
  • తర్వాత10 రోజుల్లో లక్షన్నర.. 20 రోజుల్లో 2 లక్షలు మాఫీ
  • మీడియా చిట్​చాట్​లో రుణమాఫీపై మంత్రి క్లారిటీ

హైదరాబాద్, వెలుగు:పంట రుణమాఫీలో భాగంగా ఈ నెల 18న తొలి రోజు 11.50 లక్షల కుటుంబాలకు ఒకే దఫాలో రూ. లక్ష వరకున్న రుణాలు మాఫీ చేస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. గురువారం సాయంత్రం కల్లా రైతుల రుణ ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. మంగళవారం ఆయన సెక్రటేరియెట్​లో మీడియాతో చిట్​చాట్ గా మాట్లాడారు. రుణమాఫీ అపోహలపై ఫుల్​ క్లారిటీ ఇచ్చారు. 

ఆర్థిక పరిస్థితులు కొంత ఇబ్బందికరంగా ఉన్నా ఇచ్చిన మాట తప్పకుండా  రుణమాఫీకి నిధులు ఇస్తున్నామని తెలిపారు. ‘‘రాష్ట్రవ్యాప్తంగా రైతులకు పంట రుణాలు ఇచ్చే 32 బ్యాంకుల్లో 60 లక్షల క్రాప్​ లోన్​ అకౌంట్లను గుర్తించాం. వారిలో 39 లక్షల కుటుంబాలకు చెందిన రైతులు రూ.2 లక్షల పంట రుణాలు తీసుకున్నట్టు తేలింది. ఈ రుణాలన్నీ కలిపి దాదాపు రూ.31 వేల కోట్లు ఉన్నట్టు అధికారులు తేల్చారు. 

రుణమాఫీ అమలు కార్యక్రమంలో భాగంగా తొలిరోజున ఒకేసారి 11.50 లక్షల కుటుంబాలకు రూ.లక్షలోపు పంట రుణాలను మాఫీ చేస్తున్నాం. తొలిరోజున రుణమాఫీకి రూ.6 వేల కోట్లకు పైగా నిధులు అవసరమవుతాయి. ఇప్పటికే ఈ నిధులు సిద్ధం చేశాం. ఆ తర్వాత మరో పదిరోజుల్లో  రూ.1.50 లక్షల లోపున్న  రుణాలు మాఫీ చేస్తాం. అనంతరం మరో పది రోజుల్లో రూ.2 లక్షలున్న రుణాలను మాఫీ చేయడానికి నిధులు సర్దుబాటు చేస్తాం” అని వెల్లడించారు. 

రైతులను రుణవిముక్తులను చేయడమే లక్ష్యం

రైతులను రుణ విముక్తులను చేయడమే సర్కారు లక్ష్యమని మంత్రి తుమ్మల నాగేశ్వర్​రావు తెలిపారు. పంట రుణాలు రూ.2 లక్షల కంటే ఎక్కువ ఉన్న రైతులు.. ఎక్సెస్​ అమౌంట్​ను కట్టాలని, మిగతా అర్హత ఉన్న రూ.2లక్షలను సర్కారు మాఫీ చేస్తుందని వివరించారు. పిల్లల చదువుల కోసం ఇన్ కమ్​ట్యాక్స్​రిటర్న్స్​ ఫైల్​ చేసే రైతు కుటుంబాలకు  వెసులుబాటు ఉంటుందని చెప్పారు.  పంట రుణాల కోసం బంగారు ఆభరణాలు కుదువ పెట్టుకున్నా మాఫీ చేస్తామని తెలిపారు. 

అయితే, ఇన్​కం ట్యాక్స్​ పేయర్స్​, లక్ష కంటే ఎక్కువ వేతనం ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు రుణమాఫీ వర్తించదని చెప్పారు. తక్కువ వేతనాలు ఉండే గ్రూప్– 4 ఉద్యోగుల కుటుంబాలకు క్రాప్​లోన్​ మాఫీ చేస్తామని తెలిపారు.  60 లక్షల లోన్​ అకౌంట్స్​లో ఇలాంటివి 17 వేలు ఉన్నాయని చెప్పారు. నిర్ణీత గడువులో చనిపోయిన రైతులకు రుణాలు ఉంటే.. ఆ కుటుంబాలకు మాఫీ వర్తింపజేస్తామని, పోడు భూములకు ఆర్ఓఎఫ్​ఆర్​ పెట్టుకుని లోన్​ తీసుకున్నోళ్లకు మాఫీ చేస్తామని మంత్రి వివరించారు.

కుటుంబాన్ని గుర్తించేందుకే రేషన్​కార్డు

భూమి పట్టా పాస్ బుక్​ ఆధారంగానే రైతుల ను గుర్తించి, రుణమాఫీ వర్తింపజేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వర్​రావు తెలిపారు. కుటుంబాన్ని గుర్తించేందుకే రేషన్ కార్డు నిబంధనను పెట్టినట్టు చెప్పారు. రేషన్​ కార్డు లేని కుటుంబాలు కేవలం 6 లక్షలే ఉన్నాయని, ఇలాంటి ఫ్యామిలీస్​ను వ్యవసాయశాఖ అధికారులు నేరుగా గుర్తించి,  రుణమాఫీ చేస్తారని తెలిపారు. గత ప్రభుత్వ నిబంధనలనే  క్రాప్​ లోన్ల మాఫీకి అమలు చేస్తున్నామని చెప్పారు. 

2018, 2023లో  రెండుసార్లు రుణమాఫీ చేసిన సందర్భంలో కూడా రేషన్​ కార్డు డేటా ఆధారంగా కుటుంబాలను నిర్ధారించారని మంత్రి తెలిపారు. ఒకేసారి రూ.31 వేల కోట్ల రుణమాఫీ చేస్తున్నామని, ఇది ప్రపంచంలోనే ఫస్ట్​ టైం అని పేర్కొన్నారు.