ప్రతి జిల్లాలో ఆయిల్ పామ్ ప్లాంట్ : తుమ్మల నాగేశ్వరరావు

ప్రతి జిల్లాలో ఆయిల్ పామ్ ప్లాంట్ : తుమ్మల నాగేశ్వరరావు

వనపర్తి, వెలుగు: రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్​ పామ్​​తోటలను సాగు చేయించి, ప్రతి జిల్లాలో పామాయిల్  ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. శనివారం వనపర్తి జిల్లాలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. కొత్తకోట మండలం సంకిరెడ్డిపల్లి వద్ద ఆయిల్  పామ్  ప్రాసెసింగ్  యూనిట్ కు శంకుస్థాపన చేశారు. పెద్దమందడి మండలంలో పీహెచ్​సీ సబ్​ సెంటర్, మార్కెట్​ గోదాములు, పెబ్బేరులో మార్కెట్​ గోదాములు, కొత్త మార్కెట్​ భవనం, రిపేర్​ పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో 11 వేల ఎకరాల్లో ఆయిల్​పామ్​ సాగు లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించారు. 

ఆయిల్​ పామ్​ సాగులో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలవాలన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 14 ప్రైవేట్ ఆయిల్  పామ్​ ప్రాసెసింగ్​ యూనిట్లు ఉన్నాయని, మరో14 ప్రభుత్వరంగంలో ఏర్పాటు చేస్తామన్నారు. ప్రస్తుతం విదేశాల నుంచి పామాయిల్​  దిగుమతి చేసుకుంటున్నామని.. భవిష్యత్​లో పక్క రాష్ట్రాలకు, ఇతర దేశాలకు ఎగుమతి చేసేలా తయారు కావాలన్నారు. రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసుకుంటే మరో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్  పామ్  తోటలను సాగు చేసుకునే అవకాశం ఉందన్నారు. ఆగస్టు 15 నాటికి సంకిరెడ్డిపల్లి పామాయిల్​ ఫ్యాక్టరీని ప్రారంభించాలని సంస్థ నిర్వాహకులను కోరారు.

పైసలు లేకే టికెట్​ లాక్కున్నారు..

ప్లానింగ్​ బోర్డ్​ వైస్​ చైర్మన్​ చిన్నారెడ్డి మాట్లాడుతూ తనకు వచ్చిన ఎమ్మెల్యే టికెట్  పైసల కారణంగానే తిరిగి తీసుకున్నారని మరోసారి కామెంట్​ చేశారు. తాను 20 ఎకరాల్లో పామాయిల్​ తోట వేశానని, రూ.1.20 కోట్ల ఆదాయం వస్తుందని చెప్పారు. ఈ డబ్బులతో వచ్చే ఎన్నికలో పోటీ చేయవచ్చని పేర్కొన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు, నాగర్​కర్నూల్​ ఎంపీ మల్లు రవి, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్​రెడ్డి, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, హార్టికల్చర్​ ఎండీ  యాస్మిన్  బాషా, డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, ఆయిల్ ఫెడ్  చైర్మన్ రాఘవ రెడ్డి, కలెక్టర్  ఆదర్శ్  సురభి పాల్గొన్నారు. 

గోపాల్​పేటలో గందరగోళం..

గోపాల్ పేట వెలుగు: గోపాల్ పేటలో కొత్తగా నిర్మించే మార్కెట్ యార్డు స్థలాన్ని ప్రజలకు అనువైన స్థలంలో నిర్మించాలని చిన్నారెడ్డి మంత్రి తుమ్మలను కోరగా, ఎమ్మెల్యే మేఘారెడ్డి వర్గీయులు అభ్యంతరం తెలిపారు. దీంతో రెండు వర్గాల మధ్య రభస జరిగింది. బుద్దారం గండి సమీపంలో రసాబాస మధ్య మార్కెట్  యార్డుకు మంత్రి శంకుస్థాపన చేసి వెళ్ళిపోయారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేఘారెడ్డి మాట్లాడుతూ 14 నెలల్లో రూ.850 కోట్లతో జిల్లాలో అభివృద్ధి పనులు చేశానని, దీనిని కొందరు జీర్ణించుకోలేక పోతున్నారన్నారు. 

చిన్నారెడ్డి మాట్లాడుతూ గోపాల్ పేట, ఏదుల, రేవెల్లి ప్రజలకు అనుకూలంగా ఉన్న స్థలంలో మార్కెట్​యార్డ్​ ఏర్పాటు చేయాలని మంత్రిని కోరానని తెలిపారు. కార్యక్రమాన్ని అడ్డుకోవాలనేది తన ఉద్దేశం కాదన్నారు.