అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేస్తాం : తుమ్మల నాగేశ్వరరావు

కోదాడ, వెలుగు : రాష్ట్రంలో అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. శుక్రవారం కోదాడ పట్టణంలో ఎమ్మెల్యే పద్మావతిరెడ్డితో కలిసి క్యాంప్ కార్యాలయంలో రైతులు, కాంగ్రెస్ నాయకులతో సమావేశం నిర్వహించారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, వరి పంటకు బోనస్ ఇతర ప్రభుత్వ పథకాలకు సంబంధించి రైతుల నుంచి సలహాలు, సూచనలు అడిగి తెలుసుకున్నారు. ఈ సదర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇంకా నాలుగు జిల్లాల్లో రైతుల నుంచి అభిప్రాయాలు సేకరిస్తామని, ఆ వెంటనే రైతులందరి ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేస్తామన్నారు. 

మూడో విడత రుణమాఫీ నిధులు ఆగస్టు 15న విడుదల చేస్తామన్నారు. ఈ సీజన్ నుంచే సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇస్తామన్నారు. వరి పంట కంటే ఎక్కువ ఆదాయం వచ్చే ప్రత్యామ్నాయ పంటలు పండించడానికి రైతులు మొగ్గు చూపాలని కోరారు. రైతులు అధిక మోతాదులో యూరియా, పురుగులమందు వాడకం తగ్గించాలన్నారు. 

పామాయిల్ తోట సాగు చేసే రైతులకు ప్రభుత్వం నుంచి రూ.55 వేల సబ్సిడీని అందజేస్తున్నామని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సమావేశంలో కోదాడ ఆర్డీవో సూర్యనారాయణ, వ్యవసాయశాఖ అధికారి రజిని, కాంగ్రెస్ నాయకులు చింతకుంట లక్ష్మీనారాయణరెడ్డి, యెర్నేని బాబు, ఇర్ల సీతారాంరెడ్డి, బచ్చు అశోక్, ముస్తఫా, బాగ్దాద్, శేషు, షమీ, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.