ప్రతిపక్షాలవి మనుగడ కోసం పాట్లు : తుమ్మల నాగేశ్వర ​రావు

ప్రతిపక్షాలవి మనుగడ కోసం పాట్లు : తుమ్మల నాగేశ్వర ​రావు
  • వాళ్లను చూస్తే జాలేస్తోంది: మంత్రి తుమ్మల నాగేశ్వర ​రావు
  • సగం కూడా మాఫీ చేయనోళ్లు.. విమర్శిస్తున్నరు
  • ఆత్మపరిశీలన చేసుకోవాలని ఫైర్​

హైదరాబాద్​, వెలుగు: ప్రతిపక్ష నేతలు రాజకీయ మనుగడ కోసం పడుతున్న పాట్లును చూసి జాలివేస్తున్నదని మంత్రి తుమ్మల నాగేశ్వర ​రావు అన్నారు. నాలుగు రోజులుగా ప్రతిపక్ష నేతలు, సోషల్ మీడియాలో తమ అసత్య ప్రచారాలతో రైతులను ఆందోళనకు గురి చేస్తున్నారని విమర్శించారు. ఆదివారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. గత ప్రభుత్వం చిన్నాభిన్నం చేసిన ఆర్థిక పరిస్థితుల్లోనూ.. ఇచ్చిన మాటకు కట్టుబడి ఆగస్ట్ 15లోపు రూ.18వేల కోట్లతో రూ.2 లక్షల లోపు రుణాలు మాఫీ చేశామని చెప్పారు. 

ఒకరేమో లక్ష మాఫీ చేయడానికే ఆపసోపాలు పడి, చివరికి సగం మందికి కూడా చెయ్యలేక రైతుల నమ్మకం కోల్పోయారని తుమ్మల ఎద్దేవా చేశారు. మరొకరు వాళ్లు అధికారంలో ఉన్న ఏ రాష్ట్రం లోను ఇప్పటిదాకా రుణమాఫీ ఆలోచనే  చెయ్యలేని విమర్శించారు. వారిద్దరూ కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2 లక్షల వరకు రుణ మాఫీ చేసి, ఆ ప్రక్రియ ఇంకా కొనసాగుతుండగానే, ఎటూ పాలుపోక విషం చిమ్ముతున్నారని- అన్నారు. ప్రతి రైతుకు అర్హత ప్రకారం మాఫీ చేసే బాధ్యత మా ప్రభుత్వానిదని మంత్రి స్పష్టం చేశారు. ఇప్పటికీ రూ.లక్షల వరకు కుటుంబ నిర్దారణ అయిన రైతులందరికీ మాఫీ చేశామని తెలిపారు.

బ్యాంకులు రైతులకు కొత్త రుణాలు ఇవ్వాలి

రూ.2 లక్షల లోపు రుణాలున్న మిగిలిన రైతులకు కుటుంబ నిర్ధారణ చేసి చెల్లిస్తామన్నారు. రూ.2 లక్షల పైన ఉన్న రైతులకు, ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం రూ.2 లక్షల కంటే అదనంగా పొందిన రుణాన్ని చెల్లించిన తరువాత అర్హత బట్టి చెల్లిస్తామని చెప్పారు. బ్యాంకర్ల డేటా తప్పున్న రైతుల వివరాలును.. రైతుల నుంచి సేకరిస్తున్నామని తెలిపారు. రుణమాఫీ పొందిన రైతులకు తిరిగి కొత్త లోన్లు మంజూరు చేయాలని బ్యాంకర్లను కోరామని చెప్పారు. ఈ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనంగా రుణమాఫీ వివరాలు మీకు అందిస్తున్నామని తెలిపారు. కనీసం గత ప్రభుత్వ పెద్దలు తాము అధికారంలో వున్నప్పుడు అరకొరగా అమలు చేసిన రుణమాఫీతో కలిగిన ప్రయోజనం ఏ మేరకు జరిగిందో ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు.