
ఖమ్మం, వెలుగు: ప్రభుత్వ భూముల పరిరక్షణకు చర్యలు చేపట్టాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ లో ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ రెవెన్యూ, హౌజింగ్ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రభుత్వ స్థలాలను గుర్తించి, ఫెన్సింగ్ ఏర్పాటుచేసి, రక్షణ చర్యలు చేపట్టాలన్నారు.
పేదలకు ఇండ్ల స్థలాల పంపిణీ, ప్రభుత్వ భవిష్యత్ అవసరాలకు, పరిశ్రమలు, అభివృద్ధికి స్థలాలు ఎంతో అవసరమన్నారు. రఘునాధపాలెం మండలంలో అక్రమ మైనింగ్ కార్యకలాపాల నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మైనింగ్, పోలీస్ అధికారులతో సమన్వయం చేసుకొని అక్రమ మైనింగ్ కి అడ్డుకట్ట వేయాలన్నారు. ఖమ్మం అర్బన్ మండలం గోళ్లపాడు చానల్ పై ఉన్న ఆక్రమణలను తొలగించాలన్నారు.
ప్రభుత్వ జీవో 58, 59 లో తిరస్కరించిన దరఖాస్తులకు సంబంధించి స్థలాలను స్వాధీనం చేసుకుని, ఫెన్సింగ్ ఏర్పాటు, రక్షణ చర్యలు చేయాలన్నారు. ఎన్ఎస్పీ భూములకు సంబంధించి చట్టబద్ధంగా స్థలాల పంపిణీ, ఆక్రమణలపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించారు. చెరువులు, కాల్వల స్థలాల పరిరక్షణ చేయాలన్నారు. నిర్మాణం చేపట్టిన అన్ని డబుల్ బెడ్ రూం ఇండ్లకు సంబంధించి, అధికారులు అన్ని కాలనీలు సందర్శించి, నిర్మాణ పనుల పరిస్థితిని తనిఖీ చేయాలన్నారు.
ఇండ్ల నిర్మాణం పూర్తిచేసి, లబ్దిదారులకు అందజేయడానికి అవసరమైన నిధుల వివరాలు సమర్పించాలని చెప్పారు. సమీక్షలో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ, గుర్తించిన స్థలాల పరిరక్షణకు ఫెన్సింగ్ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్, డీఆర్డీవో సన్యాసయ్య, డిఆర్వో ఎం. రాజేశ్వరి, ఖమ్మం ఆర్డీఓ జి. గణేష్, ఏడీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శ్రీనివాసులు, ఆర్ అండ్ బీ ఎస్ఇ హేమలత, పీఆర్ ఈఈ వెంకట్ రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ ఈఈ తానాజీ, ఇర్రిగేషన్ ఇఇ అనన్య, హౌజింగ్ ఈఈ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.