వ్యవసాయంలో టెక్నాలజీని ప్రోత్సహిస్తం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 

వ్యవసాయంలో టెక్నాలజీని ప్రోత్సహిస్తం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 
  • ఇజ్రాయెల్​ ప్రతినిధి బృందంతో భేటీ

హైదరాబాద్, వెలుగు: వ్యవసాయంలో వస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునేలా  రైతులను ప్రోత్సహిస్తామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. గురువారం ఇజ్రాయెల్ కంపెనీ ఎండీ హాయ్​ ఆర్ ​అండ్​ డీ, విండ్​ పోనిక్స్​ కంపెనీ ప్రతినిధులు మంత్రిని మర్యాద పూర్వకంగా కలిశారు.  ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ..1995లో ఇజ్రాయెల్ లో పర్యటించినప్పుడు అప్పటి సీఎం ప్రోత్సాహంతో ప్రవేశపెట్టిన డ్రిప్ ఇరిగేషన్ దాదాపు 25 ఏండ్లకు ప్రాచుర్యంలోకి వచ్చిందని గుర్తుచేశారు.

కొత్త టెక్నాలజీతో  రాష్ట్ర రైతులకు సాగులో  తోడ్పడేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. త్వరలో అధికారులతో సమావేశమై పూర్తిస్థాయిలో ప్రాజెక్ట్ రిపోర్ట్​ను సమర్పించాలని ఇజ్రాయిల్​ ప్రతినిధులను మంత్రి కోరారు. అగ్రికల్చర్ రంగంలో చేపడుతున్న కార్యక్రమాలను మంత్రికి ఇజ్రాయెల్ ప్రతినిధులు చెప్పారు. స్మార్ట్ అగ్రికల్చర్, ఏఐ సెన్సార్, ఆటోమేషన్ పద్ధతులు, డిజిటల్ రెయిన్ హార్వెస్టింగ్, గ్రే వాటర్ ట్రీట్ మెంట్ వంటి పద్ధతులను  వివరించారు.

ఇజ్రాయెల్, భారత్​ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం.. తెలంగాణలో పైలట్ పద్ధతిలో అగ్రికల్చర్​లో లేటెస్ట్​ టెక్నాలజీపై రైతులకు శిక్షణ ఇచ్చేందుకు విండ్​ పొనిక్స్​ సంస్థ సిద్ధంగా ఉందన్నారు.  యూనివర్సిటీల మధ్య ఒప్పందాలతో ఇజ్రాయిల్ టెక్నాలజీని రాష్ట్రంలో అమలు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు.  సమావేశంలో వ్యవసాయశాఖ డైరెక్టర్  గోపి, హార్టికల్చర్ డైరెక్టర్ యాస్మిన్ బాషా, కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.